45 రూపాయ‌ల దొంగ‌త‌నం.. 24 ఏళ్ల త‌ర్వాత‌.. తీర్పు.. శిక్ష ఏంటంటే!!

Update: 2022-10-05 03:18 GMT
దొంగ‌త‌నం.. ఈ పేరు మ‌న‌కు కొత్త‌కాదు. సాధార‌ణ‌మే. అయితే.. దొంగ‌త‌నం అంటే.. వేలు, ల‌క్ష‌లు.. అనే క‌దా!.. అవి కాక‌పోతే.. భారీ ఎత్తున ఇళ్ల‌లో స‌రుకులు ఎత్తుకుపోయిన ఘ‌ట‌న‌లే మ‌న‌కు తెలుసు. కానీ.. 45 రూపాయ‌లు దొంగ‌త‌నం కేసు ఎక్క‌డైనా విన్నా రా?  పోనీ.. దీనిని విచారించేందుకు కోర్టు ఎంత స‌మ‌యం తీసుకుందో తెలుసా?  ఇదీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిగా మారిన వ్య‌వ‌హారం. ఓ వ్యక్తి జేబులో నుంచి రూ.45 కొట్టేసిన కేసులో ఏకంగా 24 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. నేరం చేశానని అంగీక రించిన వృద్ధుడికి(అప్ప‌ట్లో యువ‌కుడు) 4 రోజుల జైలుశిక్ష వేసింది ఉత్తరప్రదేశ్  మైన్పురిలోని న్యాయస్థానం.

అది 1998 ఏప్రిల్ 17. ఉత్తరప్రదేశ్ మైన్పురిలోని ఛపట్టీ ప్రాంతానికి చెందిన వీరేంద్ర బాథం.. పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. లైన్గంజ్ దగ్గర తన జేబులోని రూ.45ను ఇటావాలోని భూరా ప్రాంతానికి చెందిన మన్నన్ అనే వ్యక్తి కాజేశాడని అందులో పేర్కొన్నాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరున్న రూ.45ను స్వాధీనం చేసుకున్నారు. మైన్పురిలోని సీజేఎం కోర్టు ఆదేశాలతో 1998 ఏప్రిల్ 18న మన్నన్ను జైలుకు పంపారు.

విచారణ ఖైదీగా జైలులో 2 నెలల 21 రోజులు ఉన్నాడు మన్నన్. తర్వాత బెయిల్పై విడుదల అయ్యాడు. కొంతకాలానికి పోలీసులు అభియోగ పత్రం సమర్పించారు. విచారణకు హాజరు కావాలని కోర్టు నుంచి సమన్లు వెళ్లినా మన్నన్కు అందలేదట.

అసలు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదట. మన్నన్ గైర్హాజరు నేపథ్యంలో అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే.. భూరా ప్రాంతంలో మన్నన్ పేరుతో ఎవరూ లేరని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు.

రూ.45 చోరీ కేసు, మన్నన్పై జారీ అయిన అరెస్ట్ వారెంట్ ఇన్నేళ్లుగా అలానే పెండింగ్లో ఉన్నాయి. ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలని ఇటీవల అనుకున్నాడు మన్నన్. తాను నేరం చేశానని ఒప్పుకుంటున్నానని, అరెస్ట్ వారెంట్ ఉపసంహరించు కోవాలని కోరుతూ గత నెల 27న మైన్పురి సీజేఎం కోర్టును ఓ న్యాయవాది ద్వారా అభ్యర్థించాడు. ఇందుకు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

గ‌త నెల 28న కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యాడు మన్నన్. నేరం చేశానని జడ్జి ముందు అంగీకరించాడు. కోర్టు అతడికి నాలుగు రోజులు జైలు శిక్ష వేసింది. పోలీసులు వెంటనే మన్నన్ను అదుపులోకి తీసుకుని.. కారాగారానికి తరలించారు. మ‌న‌కు ఈ వార్త అందే స‌మ‌యానికి.. లేదా వెలుగు చూసే స‌మ‌యానికి.. మ‌న్న‌న్ శిక్ష కూడా పూర్త‌యిపోయి ఉంటుంది!! ఇదీ.. చిత్రం!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News