ఎస్సీలు రిజర్వుడ్‌ స్థానాల్లోనే పోటీ చేయాలనే రూలేమీ లేదు

Update: 2022-12-12 12:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీలు రిజర్వుడ్‌ స్థానాల్లోనే పోటీ చేయాలనే నిబంధన ఏమీ లేదని వెల్లడించారు. జగన్‌ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా అయినా, లేదా ఎంపీగా అయినా పోటీ చేస్తానని చెప్పారు.

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెంకట పాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తమకు బలమున్న జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయొచ్చని చెప్పారు. తనకు గుంటూరు, విజయవాడ ఏదైనా ఫర్వాలేదని ఆయన చెప్పడం విశేషం. గుంటూరు, విజయవాడ జనరల్‌ స్థానాలైన ఎస్సీలు పోటీ చేయకూడదనే రూల్‌ ఏమీ లేదన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ విజయం సాధించేందుకు త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.

రాజధాని రైతుల ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తే వాటిని సీఎం జగన్‌ వద్ద చర్చిస్తానని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వెల్లడించారు. వాటిని సీఎం వైఎస్‌ జగన్‌ ఆమోదించేందుకు తనవంతు కృషి చేస్తానని వివరించారు. అమరావతి పరిధిలో అభివృద్ది కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. తుళ్లూరు, శాఖమూరు రోడ్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

కాగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అనుచరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ 2004, 2009ల్లో తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగా కూడా పనిచేశారు. 2014 తర్వాత టీడీపీలో చేరిన ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

మళ్లీ 2019లో వైసీపీ గెలుపొందాక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా తాడికొండ అదనపు నియోజకవర్గ ఇన్చార్జ్‌ గా నియమితులయ్యారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ నియామకంపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భగ్గుమన్నారు. తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అయినా వైసీపీ అధిష్టానం వెనక్కి తగ్గలేదు.

ఇటీవల గుంటూరు జిల్లా అధ్యక్ష పదవిని మేకతోటి సుచరితను తప్పించిన వైసీపీ అధిష్టానం డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News