ఇదేంద‌య్యా.. అస్స‌లు చూడ‌లా.. ఏపీలో బ‌స్సులో గొడుగులు!

Update: 2022-10-10 09:30 GMT
ఇప్ప‌టికే రోడ్ల విష‌యంలో అభాసుపాలైంది.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ఈ విష‌యంలో సొంత రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచే కాకుండా తెలంగాణ మంత్రులు కేటీఆర్ త‌దిత‌రులు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై గ‌తంలో కామెంట్లు, సెటైర్లు సంధించారు. రోడ్లు అస్త‌వ్య‌స్తంగా మారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తీవ్ర ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఉలుకూప‌లుకూ లేద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ గుంత‌ల్లో ప‌డి గాయాల‌పాల‌య్యారు. మ‌రికొంత‌మంది మ‌ర‌ణించారు.

రోడ్ల దుస్థితిపై ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు స్వ‌యంగా రోడ్ల‌పైన గుంత‌ల్లో దిగి నాట్లు కూడా వేసి నిర‌స‌న తెలిపారు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇవి త‌మ హ‌యాంలో పాడైన రోడ్లు కావ‌ని.. చంద్ర‌బాబు హ‌యాంలో ధ్వంస‌మ‌య్యాయ‌ని కౌంట‌ర్ వేసింది.

కాగా ప్ర‌స్తుత వ‌ర్షాల‌కు రోడ్లు పూర్తిగా పాడ‌య్యాయి. మ‌రోవైపు బ‌స్సులు సైతం రోడ్ల‌ను త‌ల‌పిస్తున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణికులు గొడుగులు వేసుకుని కూర్చోవాల్సిన దుస్థితి త‌లెత్తింది. విశాఖ‌ప‌ట్నం నుంచి సాలూరు వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణికులు గొడుగులు వేసుకు కూర్చున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ బ‌స్సుకు పైన భారీ చిల్లులు ఉండ‌టంతో బ‌స్సులో వ‌ర్ష ధార‌లు కారాయి. బ‌స్సులో ఒక్క చోట అయితే ఎలాగోలా ప్ర‌యాణికులు స‌ర్దుకునేవారు. అయితే బ‌స్సంతా ఇదే ప‌రిస్థితి ఉండ‌టంతో చేసేదేమీ లేక ప్ర‌యాణికులు త‌మ సీట్ల‌లో కూర్చునే గొడుగులు వేసుకున్నారు. ఇలాగే వాన త‌గ్గే వ‌ర‌కు ప్ర‌యాణించారు. ఎవ‌రో దీన్ని ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. అంతేకాకుండా మీడియాలోనూ దీనిపైన క‌థ‌నాలు వ‌చ్చాయి. సోష‌ల్ మీడియాలో ఇది వైర‌ల్‌గా మారింది.

దీంతో ప్ర‌తిప‌క్ష నేత‌లు, ప్ర‌జ‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో రోడ్లే కాదు.. ఆర్టీసీ బ‌స్సుల ప‌రిస్థితి ఇదేన‌ని ఎద్దేవా చేస్తున్నారు. జ‌న‌సేన పార్టీ ముఖ్య నేత‌, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ దీనిపై ట్వీట్ చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం స‌మాధానం చెబుతుందో వేచిచూడాల్సిందే!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News