హైదరాబాద్ అల్లుడికి భీమవరం మామ సంక్రాంతి మెనూ తెలిస్తే అవాక్కే

Update: 2023-01-16 07:30 GMT
మర్యాదలంటే గోదారోళ్లదే. వారి మాట నుంచి చేతల వరకు మర్యాద ఉట్టి పడుతుంటుంది. మాటల్లో మర్యాద తర్వాత చేతల్లో చూపించే మర్యాదకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. మర్యాదకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వారిలో.. ఎటకారం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మేం చెప్పేది మర్యాద గురించి మాత్రమే.

సంక్రాంతి పండుగ వేళ.. ఇంటికి వచ్చిన కొత్త అల్లుడి కోసం భీమవరానికి చెందిన మామ ఒకరు చేసిన పండుగ మర్యాద హాట్ టాపిక్ గా మారటమే కాదు.. దీనికి సంబంధించిన మెనూ ఇప్పుడు వైరల్ గా మారింది. గోదారోళ్లంటే ఆ మాత్రం మర్యాద ఉండదా ఏంటన్నట్లుగా వారి తీరు ఉందని చెప్పాలి.

సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి నాగభద్రిలక్ష్మీనారాయణ అలియాస్ బద్రి.. సంధ్యల గారాల పట్టికి హైదరాబాద్ కు చెందిన పృథ్వీగుప్తాతో పెళ్లి జరిపారు. ఈ జంటకు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి పండక్కి అత్తారింటికి పిలిచారు. పండుగ వేళ ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి భారీ మెనూతో అదిరిపోయేలా చేయటమే కాదు.. ఎప్పటికి మర్చిపోలేని స్వీట్ షాకిచ్చారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 వెరైటీలతో భారీ లంచ్ ను ప్రిపేర్ చేశారు. గోదారి స్పెషల్స్ తో పాటు అన్ని రకాలైన ఫుడ్ ను సిద్ధం చేశారు. 173 వెరైటీల్లో అత్యధిక భాగంగా ఆహార పదార్థాల్ని ఇంట్లోనే తయారుచేసిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు వైరల్ గా మారాయి.

మర్యాదంటే గోదారోళ్లదే అన్న మాటకు అర్థమేంటన్నది చేతల్లో చేసి చూపించారని చెప్పాలి. ఇంత భారీ మెనూను చూసినంతనే కడుపు నిండిపోయే వేళ.. కొసరి కొసరి వడ్డిస్తున్న వేళ తినలేక కొత్త అల్లుడు పడిన అవస్థలు అన్ని ఇన్ని కావని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News