ఎవ‌రొచ్చినా, రాకున్నా.. ఆ ఇద్ద‌రు మాత్రం ప‌క్కా

Update: 2021-09-02 03:30 GMT
దివంగ‌త సీఎం, మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ గురువారం నాడు ఏర్పాటు చేసే స‌మావేశానికి ఎంత‌మంది వ‌స్తారు? అస‌లు విజ‌య‌మ్మ ఎంత‌మందిని ఆహ్వానించారు? ఆ జాబితాలో హాజ‌ర‌య్యే వారెంద‌రు?  డుమ్మా కొట్టే వారెంద‌రు?  డుమ్మా కొట్టే వారు ఎలాంటి కార‌ణాలు చెబుతారు? అన్న దిశ‌గా గ‌డ‌చిన రెండు రోజులుగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వైఎస్ ఉన్న‌ప్పుడు తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా కొన‌సాగింది. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. రెండు రాష్ట్రాల్లో గ‌తంలో ఉన్న మాదిరి రాజ‌కీయ ప‌రిస్థితులు లేవు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప‌త‌న ద‌శ‌కు చేరుకోవడం, వైఎస్ కుమారుడు జ‌గ‌న్ సొంతంగా వైఎస్సార్సీపీ పేరిట కొత్త పార్టీ పెట్టుకోవ‌డం, తెలంగాణ‌లో మారిన రాజ‌కీయ ప‌రిణామాలు.. వెర‌సి వైఎస్ స‌న్నిహితుల్లో ఇప్పటికీ కాంగ్రెస్ లో కొన‌సాగుతున్న వారిని వేళ్ల మీదే లెక్క‌పెట్టొచ్చు. మెజారిటీ నేత‌లు అటు వైసీపీలోకో, ఇటు తెలంగాణ‌లో టీఆర్ఎస్ లోకో.. లేదంటే టీడీపీ, బీజేపీ వంటి పార్టీల్లోకో వెళ్లిపోయారు.

ఇలాంటి నేప‌థ్యంలో విజ‌య‌మ్మ ఆహ్వానాన్ని మ‌న్నించే విష‌యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌ల‌తో పాటుగా ఇత‌ర పార్టీల్లోకి చేరిపోయిన హ‌స్తం పార్టీ మాజీ నేత‌లు కూడా ఒక‌టికి పది సార్లు ఆలోచిస్తున్నార‌ట‌. ఎందుకంటే.. ఇప్పుడు మారిన రాజకీయ ప‌రిణామాల్లో విజ‌య‌మ్మ ఆహ్వానాన్ని మ‌న్నించి వెళితే.. తాము ఉంటున్న పార్టీలు త‌మ‌ను ఏ కోణంలో చూస్తాయోన‌న్న భ‌యం వారిని వెంటాడుతోందట‌. అంతేకాకుండా ఎప్పుడో కాంగ్రెస్ పార్టీని వీడిన తాము ఇప్పుడు ఇత‌ర పార్టీల్లో ఇమిడిపోయామ‌ని.. ఇలాంటి నేప‌థ్యంతో మీ ఆహ్వానాన్ని మ‌న్నించ‌లేమని కూడా చాలా మంది నేత‌లు అనున‌యంగానే విస‌య‌మ్మ‌కు చెప్పేశార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఆత్మీయ భేటీకి ఎవ‌రు వ‌చ్చినా.. రాకున్నా కూడా ఇద్ద‌రు నేత‌లు మాత్రం త‌ప్ప‌నిసరిగా హాజ‌ర‌వుతార‌ట‌. ఇదే విష‌యాన్ని ఆ ఇద్ద‌రు నేత‌లు స్వయంగా విజ‌య‌మ్మ‌కే చెప్పేశార‌ట కూడా. ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రంటే.. వైఎస్ ఆత్మ‌గా పేరుప‌డిపోయిన కేవీపీ రామ‌చంద్ర‌రావు, వైఎస్ కు అత్యంత స‌న్నిహితుడ‌ని పేరున్న ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌లేన‌ట‌. కేవీపీ విష‌యం గురించి పెద్డ‌గా చెప్పుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వైఎస్ ఇంట ఏ కార్య‌క్ర‌మం పెట్టి పిలిచినా.. ఏమాత్రం ఇబ్బంది లేకుండా కేవీపీ హాజ‌ర‌వుతారు. ఇక ఉండ‌వ‌ల్లి కూడా అంతే. జ‌గ‌న్ పై వ్య‌తిరేక‌త ఉన్నా, ష‌ర్మిల ప‌ట్ల వ్య‌తిరేక‌త ఉన్నా.. విజ‌య‌మ్మ పిలిస్తే ఉండ‌వ‌ల్లి వెళ్ల‌కుండా ఉండ‌ర‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా గురువారం జ‌రిగే విజ‌య‌మ్మ ఆత్మీయ స‌మావేశానికి ఎవ‌రు వ‌చ్చినా, ఎవ‌రు రాక‌పోయినా వీరిద్ద‌రు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు అవుతార‌న్న మాట‌.
Tags:    

Similar News