క‌రోనాపై టిక్‌ టాక్ చూశారు..ఆస్ప‌త్రి పాల‌య్యారు!

Update: 2020-04-09 23:30 GMT
క‌రోనా వైర‌స్‌ పై సోష‌ల్ మీడియాలో పుకార్లు - అపోహాలు విస్తృతంగా ప్ర‌చార‌మ‌వుతూనే ఉన్నాయి. తెలిసీతెలియ‌ని స‌మాచారం కోసం.. కొన్ని వ్యూస్ కోసం ప‌లువురు క‌రోనా వైర‌స్ పేరు వాడుకుని త‌మ‌కు తెలిసిన స‌మాచారాన్ని పంచుకుంటున్నారు. అది వాస్త‌వ‌మా? కాదా? అని తెలుసుకోకుండా వ్యాప్తి చేస్తున్నారు. ఇక దీనికి తోడుగా క‌రోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు అంటూ కొంద‌రు వార్త‌లు - వీడియోలు చేస్తున్నారు. వాటిని న‌మ్మిన ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్థితి. తాజాగా టిక్‌ టాక్‌ లో కొన్ని ప‌దార్థాలు తింటే క‌రోనా వైర‌స్ సోక‌ద‌ని చెప్ప‌డంతో వాటిని తిన్న ప‌ది మంది ఆస్ప‌త్రుల‌పాలైన సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లా తిరుప‌తి స‌మీపంలోని ఆల‌ప‌ల్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు టిక్‌ టాక్ వీడియోను చూశారు. ఆ వీడియోలో ఉమ్మెత్త పువ్వు జ్యూస్ తాగితే క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌ద‌ని ఉంది. దీంతో ఆ రెండు కుటుంబాల్లోని వ్య‌క్తులు ఉమ్మెత్త పువ్వు జ్యూస్ చేసుకుని తాగేశారు. అయితే కొద్దిసేప‌టికి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వెంట‌నే కుటుంబ‌స‌భ్యులు వారంద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మొత్తం 10 మంది బైరెడ్డిప‌ల్లిలోని ప్ర‌భుత్వ ఆస్ప్ర‌తిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ‌య్యారు. అస్వ‌స్థ‌త‌కు గురైన వారిలో 70 ఏళ్ల వ్య‌క్తితో పాటు ఆరేళ్ల వ‌య‌సు వారు కూడా ఉన్నారు. అయితే అదృష్ట‌వ‌శాత్తు అంద‌రూ కోలుకున్నారు. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే దీనిపై వైద్యారోగ్య అధికారుల‌తో పాటు పోలీసులు కూడా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. క‌రోనా వైర‌స్‌ పై పిచ్చిపిచ్చి వార్త‌లు - పుకార్లు న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. శుభ్రంగా ఉండ‌డం - నోటికి గుడ్డ క‌ట్టుకోవ‌డం - శానిటైజ‌ర్ వాడ‌డం - త‌ర‌చూ చేతులు శుభ్రంగా క‌డుకోవ‌డం, భౌతిక దూరం పాటించ‌డంతో క‌రోనా వైర‌స్ రాద‌నే విష‌యాన్ని పోలీసులు - వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి అస‌త్య విష‌యాలు వ్యాప్తి చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.


Tags:    

Similar News