మహిళల చిరిగిన జీన్స్ పై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు!

Update: 2022-05-16 10:37 GMT
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ.. వివాదాలు రాజేయడంలోనూ బీజేపీ నేతలను మించినవారు లేరు. ఆ పార్టీలో సాధారణ నేతలే కాకుండా ముఖ్యమంత్రుల స్థానంలో ఉన్నవారు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇలా అనవసర వివాదాల్లో ఇరుక్కుని పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు తమ పదవులు పొగొట్టుకున్నారు. అయినా వారి వ్యవహార శైలిలో ఇసుమంతైనా మార్పు రావడం లేదు.

తాజాగా ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి తీర్థ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతున్నారు. చిరుగుల జీన్స్‌ ధరించడంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్‌ ధరించడం భారతీయుల సంప్రదాయం కాదని తీర్థ సింగ్‌ తాజాగా వ్యాఖ్యానించారు. గతంలోనూ మహిళలు జీన్స్‌ ధరించడంపై ఆయన తన అభ్యంతరాలను వ్యక్తం చేయడం గమనార్హం.

కొంతమంది చిరిగిన జీన్స్‌ ధరించి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మంటగలుపుతున్నారని తీర్థ సింగ్‌ మండిపడుతున్నారు. ముఖ్యంగా వివాహితలు, యవతులు కూడా వింత వింత ఫ్యాషన్‌ ట్రెండ్లను అనుసరిస్తూ భారతీయ జీవన విధానాన్ని కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిరిగిన జీన్స్, బూట్లు ధరించినవారిని చూసి వారి పిల్లలు కూడా చెడిపోతున్నారని తీర్థసింగ్‌ చెబుతున్నారు. ఇంట్లో చిన్నారులకు సంస్కారం నేర్పాల్సిందిపోయి పిల్లలను ఇలా చెడగొట్టడం ఎంతవరకు కరెక్ట్‌ అని ఆయన నిలదీస్తున్నారు.

గతంలో ఉత్తరాఖండ్‌ బీజేపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీర్థ సింగ్‌ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతోనే తన పదవి పోగొట్టుకున్నారు. అప్పట్లో తీర్థ సింగ్‌ను ముఖ్యమంత్రిగా తప్పించిన బీజేపీ అధిష్టానం పుష్కర్‌ సింగ్‌ ధామికి సీఎం పీఠం కట్టబెట్టింది. అయినా సరే తీర్థ సింగ్‌ తగ్గకుండా మళ్లీ తన నోటికి పనిచెప్పడంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి వివాదాస్పద ఎవరు చేస్తారా.. అన్నట్టు కాసుకు కూర్చునే నెటిజన్లు సైతం తీర్థ సింగ్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్రోల్‌ చేస్తున్నారు.

గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఒకసారి క్షమాపణ కూడా చెప్పారు.. తీర్థ సింగ్‌. అయినా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు మళ్లీ అవే వ్యాఖ్యలు చేయడంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయనపై మండిపడుతున్నారు. బీజేపీ నేతలకు మహిళలంటే ఎంత చులకన భావమో తీర్థ సింగ్‌ వ్యాఖ్యలతో తెలుస్తుందని వారంటున్నారు.

అయితే.. తీర్థ సింగ్‌ వాదన మాత్రం మరోలా ఉంది. మహిళలు జీన్స్‌ ధరించడం వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. చిరుగుల జీన్స్‌ ధరించడం మాత్రం సరికాదని అంటున్నారు.

తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలతోనే త్రిపుర సీఎం విప్లబ్‌ కుమార్‌ దేబ్‌ తన ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు. వచ్చే ఏడాది త్రిపురలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం విప్లబ్‌ను తప్పించి మాణిక్‌ సాహాకు సీఎం పీఠం అప్పగించింది.
Tags:    

Similar News