తెలంగాణలో మళ్లీ 'సకలజనుల సమ్మె' నా?

Update: 2019-10-10 04:59 GMT
నాడు తెలంగాణ కోసం గొంతెత్తిన ఉద్యోగులు - కార్మికులు - సకలజనులూ .. జేఏసీ ఏర్పాటు చేసి కేసీఆర్ సాగించిన వీర తెలంగాణ పోరులో వారే కీలక పాత్రధారులు.. సూత్రధారులుగా నిలిచారు.. తెలంగాణ కోసం గర్జించిన ఆ గొంతులు నేడు వారి హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొంది.. నాడు నడిపించిన కేసీఆర్.. నేడు అధికారమెక్కి కాలదన్నుతున్నాడు.. ఆంధ్రావారిపై నాడు పోరాడించిన కేసీఆర్.. నేడు సొంత ప్రభుత్వంలో తనపైనే పోరాటం చేసేంతగా ఎందుకు దిగజరారు. దేశంలోనే సంపన్న రాష్ట్రం అని చెప్పుకున్న ఉద్యమ దళపతి నేడు ఆర్టీసీ కార్మికుల గోసను ఎందుకు తీర్చలేకపోతున్నారన్నదే అంతుచిక్కని ప్రశ్న..?

ఆర్టీసీ ఉద్యోగుల పోరు తీవ్ర రూపం దాల్చుతోంది. వారికి మద్దతుగా తెలంగాణ సమాజం కదిలివస్తోంది. బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రజాసంఘాలు - రాజకీయ పార్టీలు - ఉద్యోగ - ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఏకమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టీసీ బాటలోనే పీఆర్సీ ఇతర సమస్యలపై ఉపాధ్యాయులు సమ్మెకు రెడీ అవుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమపై వివక్షతో రగిలిపోతున్నారు..

నాడు జేఏసీ చైర్మన్ గా తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీల అండదండలతో ‘సకల జనుల సమ్మెను’ నడిపించిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నేడు అదే ‘సకల జనుల సమ్మె’కు పిలుపునిచ్చాడు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పెత్తనం.. రాష్ట్రం కోసం గళమెత్తితే..  నేడు సొంత రాష్ట్రంలో అస్తిత్వం కోసం పోరాడిల్సిన ఖర్మ మన ఆర్టీసీ కార్మికులకు పట్టిందన్నారు.

ఆర్టీసీ సమ్మెతో తెలంగాణలో ఇప్పుడు అందరు ఉద్యోగులకు తమ ఉద్యోగాలకు భద్రత లేదని ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ - మున్సిపల్ - పంచాయతీ రాజ్ చట్టాల పేరుతో అధికారులకు కళ్లెం వేయడం.. రెవెన్యూ వ్యవస్థను ఎత్తివేసే ప్లాన్ చేస్తుండడంతో ఉద్యోగుల్లో కూడా అభద్రత భావం తలెత్తింది. సో వారంతా ఇప్పుడు హక్కులు కాపాడుకోవాలని సకల జనుల సమ్మె ఆలోచన చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

ఇప్పుడు కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఏకమవుతోంది. హక్కుల కోసం పోరుబాట పడుతోంది. అఖిలపక్షం - ఉద్యోగ సంఘాలు నిన్న భేటి అయ్యి ‘సకలజనుల సమ్మె’కు పురుడుపోశాయి. మరి ఉద్యోగులు దీనికి సై అంటే ఇది కార్యరూపం దాల్చితే అందరినీ ఏకతాటికిపైకి తెచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ కు ఇంతకంటే ఘోర అవమానం మరోటి ఉండదని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు...
Tags:    

Similar News