నకిలీ వ్యాక్సిన్ తీసుకొని కుప్పకూలిన ఆ ఎంపీ !

Update: 2021-06-26 12:30 GMT
కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంటే , మరోవైపు ఈ సమయంలో కూడా కాసులకి కక్కుర్తి పడి  నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులతోపాటు ప్రముఖులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తి కూడా నకిలీ వ్యాక్సిన్ తీసుకుని అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌ కతా లోని కస్బా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఫేక్ వ్యాక్సిన్ తీసుకున్నారు మిమి చక్రవర్తి. ఆ తర్వాత శుక్రవారం రాత్రి నుంచి ఆమె అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్న చక్రవర్తికి తీవ్రమైన డీహైడ్రేషన్, తక్కువ రక్తపోటు, కడుపు తిమ్మిరి ఉన్నట్లు నిర్ధారణ అయింది.

జాదవపూర్ నుంచి ఎంపీగా గెలిచిన మిమి చక్రవర్తి శుక్రవారం సాయంత్రం నుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత తీవ్రంగా చెమటలు పట్టి ఆమె స్పృహ కోల్పోయారు. దీనితో వెంటనే ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. కాగా, ఇప్పటికే మిమి చక్రవర్తికి పిత్తాశయం, కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నాయని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ తెలిపారు. మిమి చక్రవర్తి, నకిలీ వ్యాక్సిన్ కేంద్రం నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు కోల్‌ కతా పోలీసులు, కస్బా ప్రాంతంలో నకిలీ వ్యాక్సిన్ కేంద్రం నిర్వహిస్తున్న దేవాంజన్ దేవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అనేక మందిని నమ్మించి నకిలీ వ్యాక్సిన్ కేంద్రాలకు రప్పించాడని పోలీసులు తెలిపారు. అంతేగాక, నిందితుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పుకున్నాడని వెల్లడించారు. కాగా, చక్రవర్తితోపాటు మరో  వంద మందికిపైగా ఈ నకిలీ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా తీసుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన తర్వాత కేంద్రంలోని పలు రకాల వ్యాక్సిన్ వయల్స్‌ ను సీజ్ చేసినట్లు చెప్పారు. వయల్స్ కూడా దుమ్ము ధూళితో నిండివున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ కేంద్రంలోని పరికరాలు, మందులను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు చెప్పారు

కోల్‌ కతా కార్పొరేషన్ జాయింట్ కమిషనర్‌ నని చెప్పి దేవాంజన్ మిమి చక్రవర్తిని కలిశాడు. ట్రాన్స్ జెండర్ల కోసం కాస్బా ప్రాంతంలో టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, హాజరు కావాలని ఆమెను ఒప్పించాడు. దీంతో ఆ కార్యక్రమానికి చక్రవర్తి హాజరై టీకా కూడా వేయించుకున్నారు. టీకా డోసు స్వీకరించగానే, ఫోన్‌కు మెస్సెజ్ రాలేదు. దీనితో పాటు దేవాంజన్ నుంచి కూడా ఎలాంటి సమాధానం లేకపోవడంతో మిమి చక్రవర్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాంజన్‌ను నకిలీ ఐఏఎస్‌ గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై మిమి చక్రవర్తి మాట్లాడుతూ మంచిపని కావడంతో ఆ ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్లానని తెలిపారు. స్థానికులు ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలనే ఉద్దేశంతో తాను కూడా టీకా తీసుకున్నానని, తెలిపారు. అయితే , ఆ తర్వాత అది పేక్ అని తేలడంతో షాక్ అయినట్టు తెలిపారు.
Tags:    

Similar News