జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇదేనా..?

Update: 2022-07-12 02:30 GMT
టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి వివాదాల‌కు కేంద్ర బిందువుగా నిలుస్తుంటారు. త‌న వాగ్ధాటితో ప్ర‌త్య‌ర్థుల‌నే కాకుండా సొంత పార్టీ నేత‌ల‌ను కూడా ఇరుకున పెడుతుంటారు. త‌న బోళాత‌నంతో చేతికి ఎముక లేకుండా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటూ మ‌న‌సున్న‌ మారాజుగా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి జ‌గ్గారెడ్డి ఇటీవ‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ పార్టీ అధిష్ఠానానికి ఆగ్ర‌హం తెప్పిస్తున్నారు.

దీనికంత‌టికీ కార‌ణం అంద‌రికీ తెలిసిందే. పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డిని త‌ర‌చూ విమ‌ర్శిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆయ‌న‌కు రేవంతుకు వ్య‌క్తిగ‌తంగా ఎక్క‌డ చెడిందో తెలియ‌దు కానీ మొద‌టి నుంచీ ఆయ‌న అంటే అస్స‌లు ప‌డ‌డం లేదు. అధ్య‌క్ష ప‌ద‌వికి రేవంత్ అన‌ర్హుడ‌ని ఆది నుంచీ విమ‌ర్శిస్తున్నారు. మొద‌టి నుంచీ పార్టీలో ఉన్న కోమ‌టి రెడ్డి వంటి వారికి ప‌ద‌వి ఇవ్వాల‌ని బ‌హిరంగంగానే అభిప్రాయం వెలిబుచ్చారు. కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌, వీ హ‌నుమంత‌రావు, జ‌గ్గారెడ్డి వంటి వారు అస‌మ్మ‌తి బ్యాచ్ గా గుర్తింపు పొందారు. ఏమైనా అంటే పార్టీలో భిన్నాభిప్రాయాలు.. భేదాభ్రిపాయాలు వంటి ఏవో అర్థం కాని సూత్రీక‌ర‌ణ‌లు చెబుతున్నారు.

అందుకే ఏఐసీసీ కూడా వీరిపై ఒకింత ఆగ్ర‌హంగా ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నారు కాబ‌ట్టి ఓపిక ప‌డుతోంది. ఇత‌ర వ్య‌క్తులైతే ఈపాటికే వేటు వేసేది. అయినా జ‌గ్గారెడ్డి త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. రేవంత్ ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌ని.. సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శిస్తున్నారు. కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ దారిలోనే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు, బ‌హిరంగ స‌భ‌ల‌కు డుమ్మా కొడుతున్నారు. దీనిపై స్వ‌యంగా రాహుల్ గాంధీ స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌రంగ‌ల్ స‌భ నుంచి అంద‌రూ సైలెంట్ అయ్యారు.

దీంతో అంతా దారిలో ప‌డిన‌ట్లే అని భావించారు. కానీ విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి విష‌యంలో ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. హైద‌రాబాద్ వ‌చ్చిన య‌శ్వంత్ సిన్హాను ఎవ‌రూ క‌ల‌వొద్ద‌ని రేవంత్ ఆదేశిస్తే వీహెచ్ స్వ‌యంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో స్వాగ‌తించారు. జ‌గ్గారెడ్డి కూడా క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నించారు. రేవంత్ కాద‌న్న ప‌నికి వీరు కావాల‌నే వ్య‌తిరేకంగా చేయాల‌నే చూశారు. దీంతో ఆగ్ర‌హించిన రేవంత్ పార్టీ గీత దాట‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తూ తీవ్ర ప‌ద‌జాలం ప్ర‌యోగించారు.

దీంతో జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ రేవంతును విమ‌ర్శించారు. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని తెలిపారు. అయితే అంద‌రూ ఆయ‌న రాజీనామా చేస్తార‌నే భావించారు. కానీ వెంట‌నే యూట‌ర్న్ తీసుకొని అవన్నీ వ్యూహంలో భాగ‌మేన‌ని ప్ర‌క‌టించారు. మ‌ళ్లీ తాజాగా ఆ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ద‌స‌రా రోజున ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

ఆ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఏమిటా అని ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను అసెంబ్లీ బ‌రిలో ఉండ‌బోన‌ని.. త‌న కూతురు జ‌యారెడ్డికి టికెట్ ఇవ్వ‌మ‌ని అధిష్ఠానాన్ని కోర‌తార‌ని తెలుస్తోంది. తాను మాత్రం వీలైతే పార్ల‌మెంటు బ‌రిలో ఉండాల‌ని లేదంటే క్రియాశీల రాజ‌కీయాల నుంచి దూరం జ‌ర‌గాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!
Tags:    

Similar News