భావోద్వేగ మహాయుద్ధానికి 16 ఏళ్లు!

Update: 2015-07-26 10:32 GMT
యుద్ధాల గురించి పుస్తకాల్లో చదువుకునే తరం ఉన్నట్లుండి నిజమైన యుద్ధం చూడాల్సి వస్తే..? సరిగ్గా 16 ఏళ్ల కిందట ఇదే జరిగింది. పాకిస్థాన్ కవ్వింపులకు దీటైన బదులిస్తూ మన సైన్యం భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన కార్గిల్ యుద్ధం జరిగి 16 ఏళ్లవుతోంది. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా జరుపుకునే విజయ్ దివస్ ను ఆదివారం దేశం ఘనంగా జరుపుకొంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమర జవాన్లకు నివాళులర్పించారు.

1999 మేలో ఆరంభమైన కార్గిల్ యుద్ధం జులై 26 వరకు కొనసాగింది. ఆ రోజు పాకిస్థాన్ సైనికులు ఓటమిని అంగీకరిస్తూ వెనక్కి మళ్లడం.. భారత సైనికులు కార్గిల్ లో భారత జెండాను రెపరెపలాడించడం ప్రతి భారతీయుడికీ గర్వకారణంగా నిలిచింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్థాన్ కవ్వింపులే. కార్గిల్ ప్రాంతంలో కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ కొందరు భారత సైనికుల ప్రాణాలు తీసి పాకిస్థాన్ సైన్యం తమ కుఠిల బుద్ధిని చాటుకుంది.

మొదట ఇది కాశ్మీర్ తిరుగుబాటుదారులు చేస్తున్న ఆందోళనగా భావించారు. కానీ చనిపోయిన భారత జవాన్ల దగ్గర లభించిన ఆధారాల్ని బట్టి పాక్ సైనిక దళాల హస్తం బయటపడింది. అప్పటికే కాశ్మీర్ లోని పర్వత ప్రాంతాల్ని పాకిస్థాన్ సైనికులు ఆక్రమించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన వాజ్ పేయి ప్రభుత్వం మన సైన్యాన్ని రంగంలోకి దింపింది. పాక్ సైన్యానికి బుద్ధి చెప్పి.. వాస్తవాధీన రేఖను దాటి ఆక్రమించుకున్న ప్రదేశాల్ని భారత సైన్యం తిరిగి స్వాధీన పరుచుకుంది. ఈ యుద్ధంలో 500 మంది భార జవాన్లు, అధికారులు అమరులయ్యారు. వారికి ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తోంది దేశం.
Tags:    

Similar News