ఎన్నిక‌ల వేళ ప్ర‌శ్నిస్తే..ఊరికి రానని మొండికేస్తే ఎలా?

Update: 2018-10-05 11:04 GMT
ఓప‌క్క టీఆర్ ఎస్ అధినేత‌.. తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాను గెలిచే సీట్ల సంఖ్య‌ను అంత‌కంత‌కూ పెంచుకుంటూ పోతుంటారు. ఎన్నిక‌ల‌కు ముందు త‌మ బ‌లం అంత‌ని.. ఇంత‌ని పెద్ద ఎత్తున చెప్పుకోవ‌టం.. బీరాలు ప‌ల‌క‌టం కామ‌న్. అలా అని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే త‌ర్వాత ఇబ్బంద‌న్న ఉద్దేశంతో తాము ప‌లికిన అత్యుత్సాహ మాటల్ని కాస్త టోన్ డౌన్ చేయ‌టం క‌నిపిస్తుంది.

కానీ.. కేసీఆర్ తీరు ఇందుకు భిన్నంగా. మొన్న‌టివ‌ర‌కూ తాము 100సీట్లు ప‌క్కా గెలుస్తామ‌ని తొడ కొట్టి మ‌రీ స‌వాల్ చేస్తున్న‌ట్లుగా మాట్లాడుతున్న ఆయ‌న‌.. నిన్న‌టి నుంచి వంద కాదు.. 110 సీట్ల‌లో గెలుపు ప‌క్కా అంటూ చేస్తున్న వ్యాఖ్య‌లు మ‌తి పోగొట్టేలా ఉన్నాయి. ఆయ‌న చెప్పిన‌ట్లుగా 110 సీట్లు గెల‌వ‌టం అంటే.. మ‌జ్లిస్ మిన‌హాయించి మిగిలిన విప‌క్షాల‌న్నీ క‌లిసి గెలిచేవి కేవ‌లం రెండంటే రెండు సీట్లు. నిజానికి అలాంటిది సాధ్య‌మేనా? అన్న‌ది ప్ర‌శ్న‌. త‌న బ‌లాన్ని కావాల‌ని ఎక్కువ చేసి  చెప్పుకుంటున్నారో లేదంటే మితిమీరిన ఆత్మ‌విశ్వాసంతో కేసీఆర్ అలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారో అర్థం కాని ప‌రిస్థితి.

గులాబీ బాస్ తీరు అలా ఉంటే.. గులాబీ తాజా మాజీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి మ‌రోలా ఉంది. అదిలాబాద్ జిల్లా బోథ్ తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సంగ‌తే చూడండి. ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టీఆర్ ఎస్ టికెట్ కేటాయించారు కేసీఆర్‌. ఆయ‌న త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్ర‌చారంలో భాగంగా త‌ల‌మ‌డుగు మండ‌లం కుచ్లాపూర్ గ్రామానికి వెళ్లారు.

అధికార పార్టీ అభ్య‌ర్థికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికి.. ఓట్లు వేస్తామ‌న్న మాట‌లు కాకుండా (ఎందుకంటే సీఎం  కేసీఆర్ తాము చాలా చేశామ‌ని.. జ‌నం తాము కోర‌క ముందే కారు గుర్తుకు ఓట్లు గుద్ది ప‌డేయాల‌న్న ఆస‌క్తితో ఉంటున్నార‌న్న మాట‌లు చెబుతున్న నేప‌థ్యంలో) స‌మ‌స్య‌ల చిట్టాను చ‌దివి వినిపించి.. నాలుగున్న‌రేళ్ల‌లో మీరు పొడిచింది ఏమిటి? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బ‌రికాయ కొట్టి మూడేళ్లు అయినా ప‌ని ముందుకు జ‌ర‌గ‌లేద‌ని.. డ‌బుల్ బెడ్రూం ఙ‌ల్లు.. ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూపంపిణీ సంగ‌తేంటి? అంటూ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు వేసి నిల‌దీశారు. ఊహించ‌ని రీతిలో ప్ర‌శ్న‌లు వ‌ర్షం కురిస్తున్న గ్రామ‌స్తుల తీరుకు తాజా మాజీకి చ‌ర్రుమంది. వెంట‌నే.. ఆయ‌న అల‌క‌బూని.. న‌న్ను ఇలా అడిగేస్తారా?  ఇక మీ ఊరికి ప్ర‌చారానికే రాను ఫో అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి వెళ్లిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.  ఇలాంటి తీరే వైరా తాజా మాజీ ఎమ్మెల్యే మ‌ద‌న్ లాల్‌ కు ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది? త‌మ‌పై అట‌వీ సిబ్బంది దౌర్జ‌న్యాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని.. ఇలాంట‌ప్పుడు మేం మీకు ఓట్లు ఎందుకు వేయాలంటూ ప్ర‌శ్నించిన ప్ర‌జ‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేక కిందా మీదా ప‌డుతున్న‌ట్లు చెబుతున్నారు. ఇలా మాజీల‌కుఎదుర‌వుతున్న ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో 110 సీట్లు మావేన‌ని చెబుతున్న కేసీఆర్ మాట‌లు కొత్త అనుమానాల‌కు తెర తీస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News