యాగం యోగాన్ని ఇస్తుందా?

Update: 2015-10-29 11:30 GMT
అధినేత తెలివితేట‌ల మీద మిగిలిన పార్టీల‌తో పోలిస్తే టీఆర్ ఎస్ నేత‌లు చాలా న‌మ్మ‌కంగా ఉంటారు. మిగిలిన రాజ‌కీయ పార్టీ నేత‌లు త‌మ అధినేత‌ల మీద.. వారి సామ‌ర్థ్యం మీద కొన్ని సంద‌ర్భాల్లో సందేహాలు వ్య‌క్తం చేస్తారు కానీ.. గులాబీ బ్యాచ్ మాత్రం కించిత్ సందేహానికి కూడా గురి కారు. ఒక‌వేళ ఎవ‌రైనా దూర‌దృష్టితో ఏదైనా చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తే.. తేడా వాడిగా చూస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు ముందు కేసీఆర్ మీద సందేహాలున్న కొద్ది మంది సైతం తెలంగాణ రాష్ట్ర సాధ‌న త‌ర్వాత అధినేత శ‌క్తియుక్తుల మీద విప‌రీత‌మైన న‌మ్మ‌కం పెరిగిపోయిన ప‌రిస్థితి.

అందుకే.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఒక‌వైపు ఆగ‌కుండా సాగుతున్నా.. పాల‌నా ప‌ర‌మైన అంశాల మీదా ఎవ‌రూ ఆందోళ‌న ప‌డిన‌ట్లుగా క‌నిపించ‌రు. తాజాగా సీబీఐ వ‌చ్చి కొన్ని ప్ర‌శ్న‌లు వేసి వెళ్లార‌న్న మాట బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు.. ఇవ‌న్నీ పెద్ద విష‌యాలేం కావ‌న్న ధీమా వారి మాట‌ల్లో క‌నిపించేది. అయితే.. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి తాజాగా నెల‌కొంద‌ని చెబుతున్నారు.

త‌న ఫాంహౌస్‌ లో గులాబీ అధినేత నిర్వ‌హించాల‌ని భావిస్తున్న చండీయాగంపై గులాబీ బ్యాచ్ లో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. భారీగా యాగాన్ని చేప‌ట్టాల‌న్న త‌మ అధినేత ఆకాంక్ష‌కు ఎదురుచెప్పే ప‌రిస్థితి లేకున్నా.. అన‌వ‌స‌రంగా యాగం జోలికి వెళుతున్నార‌న్న మాట లోగొంతుక‌తో వినిపించ‌టం విశేషం.

యాగంతో ల‌భించే యోగం సంగ‌తి ప‌క్క‌న పెడితే.. లేనిపోని విమ‌ర్శ‌లు ఎదుర‌వుతాయ‌న్న భావ‌న వారిలో వ్య‌క్త‌మ‌వుతోంది. యాగం చేయ‌టం త‌ప్పు కాదుకానీ.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో స‌రికాద‌న్న మాట ప‌లువురి నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం. రైతుల స‌మ‌స్య‌లు ఒకప‌క్క చికాకు పెట్ట‌టం.. మ‌రోవైపు అప్పుడెప్పుడో కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణ‌యాలు ఒక‌టికిఒక‌టిగా బ‌య‌ట‌కు రావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే బ‌తుక‌మ్మ పండుగ‌ను భారీగా నిర్వ‌హించి ఒక వ‌ర్గం అభిమానం పొందిన‌ప్ప‌టికీ.. మిగిలిన వ‌ర్గాలు అసంతృప్తితో ఉన్నాయ‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ యాగం పేరిట భారీ కార్య‌క్ర‌మాన్ని చేపట్ట‌టం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు పెంచేలా ఉంటాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎప్పుడూ లేనిది అధినేత తీసుకున్న నిర్ణ‌యంపై గులాబీ ద‌ళంలో సందేహాలు ముసురుకోవ‌టం కాస్త కొత్త వ్య‌వ‌హారంగా చెబుతున్నారు.
Tags:    

Similar News