ఏపీ విద్యుత్ ఆపేసినా లైట్ అనేశారు

Update: 2017-06-07 05:07 GMT
వివాదాల‌కు ఒక్కొక్క‌రు ఒక్కోలా రియాక్ట్ అవుతుంటారు. వివాదాలు అన్న‌వి రాకుండా చూసుకునే వారు కొంద‌రైతే.. ఎదురైన వివాదాల్ని పెంచ‌కుండా తుంచేసేవారు మ‌రికొంద‌రు. అందుకు భిన్నంగా.. సై అంటే సై అనే వారూ ఉంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎస్పీడీసీఎల్ సీఎండీ తీరు సై అనే మాదిరి ఉంది.

ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బ‌కాయిల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య తాజాగా వివాదం మ‌రింత ముద‌ర‌టం తెలిసిందే. ఈ వివాదాన్ని చ‌ర్చ‌ల రూపంలో ప‌రిష్క‌రించుకోవ‌టానికి తాము సిద్ధంగా లేన‌ట్లుగా సీఎండీ మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

వేలాది కోట్లు (సుమారు రూ.4వేల కోట్ల‌కు పైనే) విద్యుత్ బ‌కాయిలు తెలంగాణ ప్రభుత్వం ఉన్న‌ట్లుగా ఏపీ విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తాము స‌ర‌ఫ‌రా చేసిన విద్యుత్ కు చెల్లించాల్సిన బ‌కాయిల్ని చెల్లించని నేప‌థ్యంలో తెలంగాణ‌కు స‌ర‌ఫ‌రా చేసే విద్యుత్‌ ను తాము నిలిపివేయ‌నున్న‌ట్లుగా ఏపీ విద్యుత్ అధికారులు ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ ర‌ఘుమారెడ్డి అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. బ‌కాయిల గురించి మాట్లాడ‌ని ఆయ‌న‌.. విద్యుత్ నిలిపివేయ‌టం మీద‌నే ఫోక‌స్ చేశారు. ఏపీ త‌మ‌కు విద్యుత్ నిలిపివేస్తే.. తాము కూడా నిలిపివేస్తామ‌ని ప్ర‌క‌టించారు. విభ‌జ‌న సంద‌ర్భంగా తెలంగాణ ఉత్ప‌త్తి చేసే విద్యుత్ లో కొంత మొత్తాన్ని ఏపీకి స‌ర‌ఫ‌రా చేయ‌టం.. ఏపీ ఉత్ప‌త్తి చేసే థ‌ర్మ‌ల్ విద్యుత్ లో కొంత మొత్తాన్ని తెలంగాణ‌కు పంపిణీ చేయ‌టం చేయాలి. ఇలా స‌ర‌ఫ‌రా చేసిన విద్యుత్‌ కు సంబంధించి తెలంగాణ బాకీ ప‌డింది. ఈ మొత్తాన్ని వ‌సూలు విష‌యంలో ఏర్ప‌డిన వివాదం.. రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారుల మ‌ధ్య మాటల యుద్ధానికి తెర తీసేలా చేసింది.

ఏపీ విద్యుత్ నిలిపివేస్తే తాము కూడా విద్యుత్ నిలిపివేస్తామ‌ని.. సెప్టెంబ‌ర్.. అక్టోబ‌ర్ ల‌లో విద్యుత్ అవ‌స‌రం ఉంటుంద‌ని.. అప్ప‌టికి సోలార్ విద్యుత్ అందుబాటులోకి రావ‌టంతో పాటు.. ఛ‌త్తీస్ గ‌ఢ్ నుంచి విద్యుత్ అందుబాటులోకి రానుంద‌ని ర‌ఘుమారెడ్డి చెప్పిన మాట‌లు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News