ఆయన మాట్లాడితే.. వీరు వెళ్లిపోతారుట..!

Update: 2015-09-13 06:36 GMT
తెలంగాణ తెలుగుదేశం నాయకుల వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, తమ పార్టీ ఎమ్మెల్యే లను తమకుకాకుండా చేసినందుకు వారి మీద అక్కసు వెళ్లగక్కడానికి వారికి చాలా మార్గాలు ఉంటాయి. కానీ.. అలాంటి ఎజెండాతో అసలు సభలో పాల్గొనకుండా వెళ్లిపోతే అది ఏమాత్రం విజ్ఞత అనిపించుకుంటుంది? ఈ విషయంలో వారి స్కెచ్‌ ఏంటో గానీ.. ప్రజలు మాత్రం.. ఆ నిర్ణయాలు చూసి ఆశ్చర్యపోతున్నారు.

త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. సభలో ఎలాంటి వ్యూహం అనుసరించాలో చర్చించుకోవడానికి టీడీఎల్పీ సమావేశాన్ని శనివారం నాడు నిర్వహించారు. రైతుల ఆత్మహత్యల దగ్గరినుంచి - తలసాని రాజీనామా - ఎమ్మెల్యే లపై చర్య తీసుకోవడం అనే అంశం వరకు మొత్తం 20 పాయింట్లతో సభలో పోరాటానికి ఒక ఎజెండా తయారుచేశారు. అంతా బాగానే ఉంది. అయితే ఒక్క అంశం దగ్గరే వారి పోకడ చిత్రంగా కనిపిస్తోంది.

తలసాని తమ పార్టీ ఎమ్మెల్యే కాగా - ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడంపై తెదేపా మహా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మీద చర్యకు వారు చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ చేసి.. అలసిపోయారు. ఈసారి సభలో మాత్రం.. తలసానిని బర్తరఫ్‌ చేయాలనే డిమాండ్‌ ను కూడా ప్రధానంగా వినిపించాలని అనుకుంటున్నారు. బాగానే ఉంది. అయితే.. మంత్రి హోదాలో తన శాఖకు సంబంధించిన అంశాలు వివరించడానికి తలసాని మైకు అందుకుంటే మాత్రం.. తమ పార్టీ వారంతా లేచి సభ బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా వారు చెబుతున్నారు. అంటే.. తలసానిని మంత్రి కింద గుర్తించడం లేదన్నట్లుగా వ్యవహరిస్తారన్నమట.
 
వీరు వెళ్లిపోయినంత మాత్రాన స్పీకరు ఒక మంత్రికి మైకు ఇవ్వకుండా ఉంటారా? అలాగే వీరు మాటిమాటికీ సభలోంచి బయటకు వెళ్లినంత మాత్రాన ఆయన మంత్రి పదవి ఊడుతుందా? అని జనం అనుకుంటున్నారు. ఆయన పదవి మీద పోరాడాలంటే.. వేరే మార్గాలు చూసుకోవాలి గానీ.. ఇలా సభను వదిలేసి వెళ్లిపోతే ఎలా? అనుకుంటున్నారు.
Tags:    

Similar News