గడప గడపపై జగన్‌ మీటింగ్‌.. హాజరైన ఆ ఇద్దరు వివాదాస్పద ఎమ్మెల్యేలు

Update: 2022-12-16 07:34 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గాల ఇన్‌చార్జులను గడప గడపకు పంపుతున్నారు. ఇందుకోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రత్యేక ప్రోగ్రామ్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. సంక్షేమ పథకాల వల్ల ఈ మూడున్నరేళ్లలో కలిగిన లబ్ధిని వారికి వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోమారు గెలిపించాలని కోరుతున్నారు.

మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ లో 2.67 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వీరంతా లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజెప్పడం, ప్రభుత్వం తరఫున సర్వేలు చేయడం వంటివి చేస్తున్నారు. వలంటీర్లను ఉపయోగించుకుని మరోమారు వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించుకోకూడదని ఇటీవల ఎన్నికల సంఘం జగన్‌ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పునరాలోచనలో పడ్డ జగన్‌ వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడానికి గృహ సారథులతో పేరుతో 5.20 లక్షల మందిని నియమించాలని నిర్ణయించారు. వలంటీర్లు మాదిరిగానే వీరు కూడా ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ఉంటారు. బూత్‌ లెవల్లో, క్షేత్ర స్థాయిలో, గ్రామాల్లో వీధుల స్థాయిలో జరిగే ప్రతి విషయాన్ని పార్టీకి నివేదిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా వైసీపీ తరఫున ప్రజలకు మెసేజులు పంపడం, తమకు ఓట్లేస్తేనే ఇంకా పథకాలు వస్తాయని వివరించడం, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో, లేదో ఆరా తీయడం, ప్రజల రాజకీయ ఆసక్తులను తెలుసుకోవడం, వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో పార్టీ పెద్దలకు నివేదించడం చేస్తారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లతో సమీక్షించారు. నాలుగు నెలల క్రితం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జనవరి నాటికి పూర్తి కానుంది. ఈ కార్యక్రమం చేపట్టినప్పుడే ఆరు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని జగన్‌ సమయం నిర్దేశించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా తాజాగా ఈ కార్యక్రమ పురోగతిపై జగన్‌ సమీక్షించారు. అయితే ఈ కార్యక్రమానికి గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు (రాజోలు), టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్‌ (గన్నవరం)లకు కూడా ఆహ్వానం అందింది. దీంతో వారు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజోలు నుంచి రాపాక వరప్రసాద్‌ కు, గన్నవరం నుంచి వల్లభనేని వంశీకి సీట్లు ఖాయమని దీన్ని బట్టి తేలిపోయిందని అంటున్నారు.

గత ఎన్నికల్లో జనసేన, టీడీపీ నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్, వల్లభనేని వంశీ ఆ తర్వాత కొద్ది కాలానికే వైసీపీ పంచన చేరారు. వైసీపీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. వైసీపీ జెండాలను మెడలో వేసుకుని పలు కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు. వాస్తవానికి వీరిపై అనర్హత పడటానికి ఇదొక్కటి చాలు. అయినా స్పీకర్‌ తమ్మినేని సీతారాం వీరిపై అనర్హత వేటు వేయకపోవడం గమనార్హం.

అటు రాపాక, ఇటు వల్లభనేని వంశీ ఇద్దరూ తమ అధినేతలపై తీవ్ర విమర్శలు చేసినవారే. చంద్రబాబును, లోకేష్‌ ను విమర్శించేవారిలో వల్లభనేని వంశీ ఒకరు. అలాగే పవన్‌ కల్యాణ్‌ ఇమేజీతో తాను గెలవలేదని.. తన సొంత ఏర్పాట్లతోనే తాను గెలిచానని గతంలో రాపాక వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ సైతం జగన్‌ సమావేశానికి ఆహ్వానం రావడం కొసమెరుపు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News