ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ..మనీ ప్రింట్ పై ఉదయ్ కొటక్ సంచలన వ్యాఖ్యలు !

Update: 2021-05-27 10:38 GMT
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ తో  క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని , ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థకి ఊతమిచ్చేందుకు ఆర్థిక ప్యాకేజీ అవసరమని, దారుణంగా దెబ్బతిన్న రంగాలకు ప్రభుత్వం ఊతమివ్వాలని ఆర్థిక రంగ నిపుణులు, ఆయా రంగాలు ప్రభుత్వానికి కోరుతున్నాయి. తాజాగా కొటక్ మహీంద్రా ఎండీ, భారత పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు డబ్బులు ప్రింట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ప్రింట్ చేస్తారు అంటూ ప్రశ్నించారు.

అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరం అన్నారు. దిగువ మధ్య తరగతి సమాజాన్ని, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనివ్వడానికి సహాయక ప్యాకేజీని ప్రకటించాలని ఉదయ్ కొటక్ ప్రభుత్వాన్ని కోరారు. చిన్న పరిశ్రమలకు హామీరహిత రుణాలకు సంబంధించిన క్రెడిట్ గ్యారెంటీ స్కీం కింద ఇచ్చే పరిమాణాన్ని రూ.3 లక్షల కోట్ల నుండి రూ.5 లక్షల కోట్లకు పెంచాలని కోరారు. కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా గత ఏడాది రూ.3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకాన్ని ప్రకటించింది కేంద్రం. దీనిని రూ.5 లక్షల కోట్లకు పెంచే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో లోబేస్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 శాతం ఆర్థిక వృద్ధి నమోదవుతుందనే అంచనాలపై కూడా ఉదయ్ కొటక్ స్పందించారు. భారత్ ప్రస్తుతం డబ్బులు ప్రింట్ చేయాల్సిన సమయం వచ్చిందని ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యాలెన్స్ షీట్‌ను విస్తరించడానికి ఇది సరైనసమయమని, ద్రవ్య విస్తరణ, డబ్బు ముద్రణ కోసం ఆర్బీఐ నుండి మద్దతు ఉంటుందన్నారు. అయితే కొంత సమయం వేచి చూడాలని, మనీ ప్రింటింగ్ గురించి మాట్లాడుతూ... ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అన్నారు.
Tags:    

Similar News