ఆ ముఖ్యమంత్రి కుమారుడు సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-23 09:33 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయనిధి స్టాలిన్‌ ప్రస్తుతం తన తండ్రి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇటీవలే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుని క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రిగా నియమించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చెన్నై పరిధిలో పలు ప్రాంతాల్లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ఉదయనిధి స్టాలిన్‌ పాల్గొన్నారు. తాను క్రిస్టియన్‌ అని, క్రిస్టియన్‌ అని చెబితే చాలామందికి కడపు మంటగా ఉంటుందని పరోక్షంగా బీజేపీ నేతలకు చురకలంటించారు. అలాగే తాను ఇలా మాట్లాడటం వల్ల వారంతా బాధపడారని పేర్కొన్నారు.  అలాంటి వాళ్లకు ఏం సమాధానం చెబుతామని.. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమేనని తెలిపారు. మనమందరం ఒక్కటేనని స్పష్టం చేశారు.

తనను తాను క్రి స్టియన్‌ అని చెప్పుకోవడం గర్వంగా ఉందని ఉదయనిధి స్టాలిన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.  తాను ఎగ్మోర్‌లోని క్రిస్టియన్‌ స్కూల్‌లో చదివాననన్నారు. అలాగే చెన్నైలోని లయోలా కాలేజీలో చదివానన్నారు. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని గుర్తు చేశారు. ఈ కారణాలన్నింటివల్ల తాను క్రైస్తవుడనని వ్యాఖ్యానించారు.

సంక్షేమ పథకాల అమలులో వివిధ సర్వేల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ దేశంలోనే నెంబర్‌వన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. తమిళనాడులో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. సీఎం స్టాలిన్‌ ముందు చూపుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని వివరించారు.  

ఇప్పుడు కొంతమంది తమను ద్రావిడ సిద్ధాంతం ఏమిటని ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. ఆ ప్రశ్నకు తాను సమాధానం చెబుతానన్నారు. హిందూ మతానికి చెందిన సంక్షేమ శాఖ మంత్రి శేఖర్‌ బాబు క్రై స్తవులకు క్రిస్మస్‌ కానుకలు అందించి క్రిస్మస్‌ శుభాకాంక్షలు అందిస్తున్నారని తెలిపారు. అలాగే మంత్రి శేఖర్‌ బాబు హిందువుల పండుగలు, క్రై స్తవులు పండుగలు, ముస్లిం పండుగలకు కూడా హాజరవుతున్నారని గుర్తు చేశారు. ఇదే ద్రవిడ సిద్ధాంతమని ఉదయనిధి స్టాలిన్‌ పేర్కొన్నారు. అలాగే త ప్రభుత్వ సిద్దాంతం అని తెలిపారు.

దీన్నే సోషల్‌ ఫైనాన్షియల్‌ గవర్నెన్స్‌ అంటారని ఉదయనిధి స్టాలిన్‌ చెప్పడం గమనార్హం. పెరియార్, అన్నా, కరుణానిధి, ప్రొఫెసర్‌ అన్బజగన్‌ ఇదే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్‌ ఇప్పుడు వీరు చెప్పిన తరహాలోనే పాలన సాగిస్తున్నారని తెలిపారు.

ఉదయనిధి స్టాలిన్‌ పరోక్షంగా తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.    



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News