హై అలెర్ట్​ : భారతీయులంతా వెనక్కి రావాలి

Update: 2022-02-22 13:30 GMT
రష్యా, ఉక్రెయిన్ ల వివాదం మరింతగా ముదిరింది. యుద్ధానికి రష్యా సేనలు సన్నద్ధం అవుతున్నాయి. ఇందుకు గానూ ఉక్రెయిన్లోని  వేర్పాటు వాద ప్రాంతాలకు రష్యా సేనలు చేరుకున్నాయి. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయంతో యుద్ధం పక్కా అవుతున్నట్లు కనిపిస్తుంది. చాలా దేశాలు ఎన్నో  దౌత్య పరమైన చర్చలు జరిపినా కానీ ప్రతిఫలం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే దాడి అనివార్యం అయినట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక  నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న భారతీయులు వెంటనే వెనక్కి రావాలని పిలుపునిచ్చింది. ఇందుకుగానూ ఎయిర్ ఇండియా విమానాలను ఆ దేశానికి పంపింది. ఆ దేశ రాజధాని అయిన కీవ్ నుంచి ఎయిర్  ఇండియా విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి.

ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ విద్యార్థులు వెంటనే స్వదేశానికి వెను తిరగాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కీవ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు  అక్కడి యూనివర్సిటీ లు నిర్వహించే ఆన్ లైన్ క్లాస్ ల కోసం ఎదురు చూడకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేలా చూసుకోవాలని పేర్కొంది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ ను విడిచి రావాలని కోరింది.

మరోవైపు ఉక్రెయిన్ లో వైద్య విద్య ను అందిస్తున్న యూనివర్శిటీలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తాయా లేదా అనే దానిపై విద్యార్థుల్లో ఆందోళనలలు నెలకొన్నాయి. దీంతో భారత ఎంబసీకి విద్యార్థుల నుంచి భారీగా కాల్స్ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ముందు విద్యార్థులు అంతా దేశాన్ని  వదిలి స్వదేశానికి రావాలని కోరింది. ఇప్పటికే ఎంబసీ చెప్పినట్లుగా... ఇండియన్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రాసెస్‌ పై త్వరలోనే సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. దీని సంబంధించిన అన్ని విషయాలను అధికారులు మేనేజ్ చేస్తారని హామీ ఇచ్చారు. ముందుగా ఉక్రెయిన్ ను విడిచి వెళ్లడం వల్ల వారికి మంచిదని సూచిస్తున్నారు.

ఇప్పటివరకు భారత ఎంబసీ నుంచి వచ్చిన సూచనల్లో ఇది మూడోది కావడం విశేషం. ఈ నెల 20న కూడా భారత ఎంబసీ అధికారులు దేశాన్ని విడిచి స్వదేశానికి పోవాలని అక్కడ ఉన్న విద్యార్థులకు సూచించారు. తాత్కాలికంగా ఉక్రెయిన్ లో ఉండడం మంచిది కాదని పేర్కొన్నారు. అందుకే భారత్ కు వెళ్లాలని  చెప్పారు. ఉక్రెయిన్ లో  ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్ మూడు ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతోంది. ఇవి ఆ దేశ రాజధాని కీవ్ నుంచి బయలు దేరి ఢిల్లీకి చేరుకుంటాయి.
Tags:    

Similar News