జగన్ ను ఉండవల్లి ‘నువ్వు’ అని అనకూడదట

Update: 2020-10-31 17:00 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల విమర్శలు చేయటం.. పోలవరం విషయంలో కేంద్రం తీరును తప్పు పట్టటమే కాదు.. సీఎం జగన్ ను ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ఉండవల్లి విమర్శల్ని తప్పు పట్టారు. ఆయన మాటలు విచారకరమన్న ఆయన.. కేసులకు భయపడే తత్త్వం సీఎం జగన్ కు లేదన్నారు.

ఒకప్పుడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన సోనియాను ఎదుర్కొన్నారని.. పోలవరం విషయంలో ఏ మాత్రం వెనకుడుగు వేయలేదన్నారు. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించైనా.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ.. ఉండవల్లి ‘‘నువ్వు’’ అని సంభోధించటం సరికాదన్నారు. గౌరవ సీఎం జగన్ ఒక వ్యక్తి కాదని.. ఆయనో వ్యవస్థగా అభివర్ణించిన రాజమండ్రి ఎంపీ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఉండవల్లి చేసిన విమర్శలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు స్పందిస్తున్నారు. జగన్ ప్రభుత్వం మీదా.. ఆయన అమలు చేస్తున్న పథకాలపై విమర్శలు చేయటంలో మీ వ్యూహమేమిటి? అంటూ ఉండవల్లిని ప్రశ్నించారు శివరామ సుబ్రమణ్యం. కేసులకు సీఎం జగన్ భయపడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారని.. ఆ వ్యాఖ్యలు తప్పన్నారు. సోనియాను ఎదిరించి పార్టీ పెట్టి.. ఎన్నో అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ఉండవల్లిని ఉద్దేశించి జగన్ పార్టీకి చెందిన నేతలు చేసిన విమర్శలపై ఆయన ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.


Tags:    

Similar News