ఉండవల్లి అరుణ్ కుమార్... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వేదికగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేతగానే కాకుండా... తాను అనుకున్న సిద్ధాంతం కోసం ఎంతదాకా అయినా వేళ్లే మనస్తత్వమున్న వ్యక్తిగా మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఉండవల్లి... ఇప్పుడు దాదాపుగా రాజకీయ సన్యాసం చేసినట్లుగానే కనిపిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటూ ఇటీవలే ఆయన ఓ ప్రకటన చేసినా... రాజకీయాలపై మాట్లాడే తత్వాన్ని మాత్రం తాను వదులుకోలేనని కూడా స్పష్టం చేసేశారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల పైనే కాకుండా ఇతరత్రా రాజకీయాలపైనా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విస్పష్టంగా తన అభిప్రాయాలను చెప్పారు.
ముందుగా కేసీఆర్ పేరును ప్రస్తావించిన ఉండవల్లి... రాజకీయాల్లో తెలివి కలిగిన నేతగా కేసీఆర్‌కు పేరుందన్నారు. అదే సమయంలో ఇటీవల కేసీఆర్ సర్కారు హైదరాబాదులో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు సాటి తెలుగు రాష్ట్రానికి చెందిన సీఎంగా ఉన్న చంద్రబాబును కేసీఆర్ ఎందుకు పిలవలేదన్న కారణాన్ని కూడా ఉండవల్లి విశ్లేషించారు. కేసీఆర్ సర్కారు నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా ఇప్పుడు ఏపీకే పరిమితమైపోయిన చంద్రబాబు తెలంగాణతో పనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనాన్ని కూడా ఉండవల్లి ప్రస్తావించారు. అదే సమయంలో తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్‌కు ఏపీతో అస్సలు పనే లేదని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే తనకు సంబంధం లేని రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబును ప్రపంచ తెలుగు మహాసభలకు కేసీఆర్ పిలిచి ఉండకపోవచ్చని ఆయన తెలిపారు.
అయితే అట్టహాసంగా తెలుగు మహాసభను నిర్వహించిన కేసీఆర్... తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలకు చాటిన వ్యక్తిగా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నందమూరి తారకరామారావును సభా వేదికపై ప్రస్తావించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఎన్టీఆర్ ఫొటో అయినా పెట్టాల్సి ఉందని, సభా వేదికపై ఎన్టీఆర్ పేరును ప్రస్తావించి ఉండాల్సిందని కూడా ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ప్రస్తావన లేకపోవడం మినహా మిగిలినదంతా బాగానే జరిగిందన్న రీతిగా ఉండవల్లి స్పందించారు. మొత్తంగా ఇకపై ఏ సభలు, సమావేశాలు జరిగినా... కేసీఆర్ - చంద్రబాబులు ఒకరికి ఒకరు సహకరించుకునే వాతావరణం రాదని, అలా రావాలని కోరుకోవడం కూడా సాధ్యం కాదని కూడా ఉండవల్లి తేల్చేశారు. తెలుగు నేలకు చెందిన రెండు రాష్ట్రాలు కూడా వేర్వేరుగానే ప్రయాణం సాగిస్తున్నట్లుగా తమ వ్యవహారాల్లోనూ స్పష్టమైన గీతలు గీసుకుని మరీ ముందుకు సాగుతారని ఉండవల్లి చెప్పకనే చెప్పేశారన్న మాట.