ట్రంప్ గురించి తెలియని విషయాలు!

Update: 2016-11-09 14:20 GMT
కంపు వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడు అయ్యారు... ఈ విష‌యాన్ని ఇంకా చాలామందికి ఇప్పుడిప్పుడే జీర్ణం అవుతోంది. మంగ‌ళ‌వారం రాత్రి వెలువ‌డ్డ ఫ‌లితాలు ఆశ్చ‌ర్యానికి గురిచేశాయి. ఎగ్జిట్ పోల్ లో వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌ను స‌మ‌ర్థంగా త‌ట్టుకుని, అనూహ్య విజ‌యం సాధించారు. 2008లో బ‌రాక్ ఒబామా అధ్య‌క్ష ఎన్నిక ఎంత సంచ‌ల‌న‌మైందో, 2016లో ట్రంప్ ఎన్నిక కూడా అంతే సంచ‌ల‌న‌మైంది. అయితే, ఇంత‌కీ ఎవ‌రీ ట్రంప్‌... అనూహ్యంగా అమెరికా అధ్య‌క్షుడి స్థానం వ‌ర‌కూ ఎలా ఎదిగారు..? ఆయ‌న నేప‌థ్యం ఏంటీ..?  ఇలాంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డోనాల్డ్ జాన్ ట్రంప్‌... పుట్ట‌క‌తోనే శ్రీ‌మంతుడు. గోల్డెన్ స్పూన్ తో పుట్టార‌ని చెప్పాలి. తండ్రి ఫ్రెడ్ ట్రంప్‌, త‌ల్లి మేరీల నాల్గో సంతానం డోనాల్ట్ జాన్ ట్రంప్‌. జ‌న్మ‌దినం జూన్ 14, 1946. జ‌న్మ‌స్థ‌లం.. న్యూయార్క్ శివారు ప్రాంతంలో ఉన్న కీన్స్‌. అయితే, ట్రంప్ తండ్రివి జ‌ర్మ‌న్ మూలాలు, త‌ల్లివి స్కాట్లాండ్ మూలాలు. కొన్ని త‌రాల కింద‌టే వీరి కుటుంబాలు అమెరికా వ‌ల‌స వ‌చ్చేశాయి. ట్రంప్ తండ్రి మొద‌ట్నుంచీ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఎలిజెబెత్ ట్రంప్ అండ్ స‌న్స్ అనే కంపెనీ స్థాపించారు. ఇక‌, తండ్రి వ్యాపారం బాగా విస్త‌రించ‌డంతో న్యూయార్క్ లోనే పెరిగారు. డోనాల్డ్ ట్రంప్ విద్యాభ్యాసం అంతా అక్క‌డే సాగింది. వార్ట‌న్ స్కూల్ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. ఆ త‌రువాత‌, వార‌స‌త్వంగా తండ్రి వ్యాపార సంస్థ బాధ్య‌త‌లు తీసుకున్నారు.

రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి వ‌స్తూనే సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. తండ్రి పేరున ఉన్న కంపెనీ పేరును ‘ట్రంప్ ఆర్గ‌నైజేష‌న్‌’గా మార్చేశారు. పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌ను టార్గెట్ చేసుకుంటూ గృహ నిర్మాణాల‌ను చేప‌ట్టారు. ఆ త‌రువాత‌, భారీ అపార్ట్‌మెంట్లు, హోట‌ళ్లూ, వాణిజ్య స‌ముదాయాలు, బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నాల‌ను నిర్మించారు. అన‌తి కాలంలో రియ‌ల్టీ రంగంలో డోనాల్డ్ ట్రంప్ ఒక బ్రాండ్ గా ఎదిగారు.  ఆ త‌రువాత‌, కొన్ని టీవీ కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్మించారు. ‘ద అప్రెంటిస్’ అనే టీవీ ప్రోగ్రామ్ ను స్వ‌యంగా ట్రంప్ నిర్వ‌హించారు. ట్రంప్ కి అందాల పోటీలు అంటే చాలా ఇష్టం. అందుకే, 1996 నుంచి 2015 వ‌ర‌కూ ప్ర‌తీయేటా జ‌రిగే మిస్ యు.ఎస్‌.ఎ. పోటీల‌కు త‌ప్ప‌కుండా హాజ‌ర‌య్యేవారు.

ఇక, వైవాహిక జీవితం విష‌యానికొస్తే... ఇంకావాను 1977లో పెళ్లి చేసుకున్నారు. 1991లో ఆమెకి విడాకులు ఇచ్చారు. ఆ త‌రువాత‌, మార్లా జల్నికోవాను వివాహం చేసుకున్నారు. ఆమెకి కూడా త‌రువాత విడాకులు ఇచ్చేశారు. కొన్నాళ్ల‌పాటు సింగిల్‌గానే ఉన్నారు. ప‌ద‌కొండేళ్ల కింద‌ట మెలానియాను పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం అమెరికా తొలి మ‌హిళ ఈమే. మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్న ట్రంప్ కు ఐదుగురు సంతానం.

బాగా సంపాదించాక రాజ‌కీయ రంగప్ర‌వేశం చేయాల‌న్న ఆలోచ‌న ట్రంప్ కి మొద‌ట్నుంచీ ఉండేది. అందుకే, 2000 సంవ‌త్సంలోనే రిఫార్మ్ పార్టీ త‌ర‌ఫు అధ్య‌క్ష అభ్య‌ర్థిగా రంగంలో దిగే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, అభ్య‌ర్థిత్వం ఖ‌రారు అయ్యేలోపుగానే ఆ ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకున్నారు. ఆ త‌రువాత‌, అంటే 2015లో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌బోతున్న‌ట్టు వెల్ల‌డించారు. మొత్తానికి అధ్య‌క్షుడు కావాల‌నే ల‌క్ష్యాన్ని ఇన్నాళ్ల‌కు నెర‌వేర్చుకున్నారు ట్రంప్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News