ఆ సీట్ల‌పై టీ కాంగ్రెస్ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనా..!

Update: 2022-05-19 00:59 GMT
ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా ఉన్న ఆ ప్రాంతంలో ఇపుడు నీలినీడ‌లు క‌మ్ముకున్నాయా..? తెలంగాణ‌కు గుండెకాయ వంటి ఆ స్థానాల్లో స‌రైన అభ్య‌ర్థులు దొర‌క‌డం లేదా..? ఇక్క‌డ పార్టీని లేపేందుకు రేవంత్ ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా నేత‌లు స‌హ‌క‌రించ‌డం లేదా..? రాబోయే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలుపు ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనా..? అంటే విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి. అదెక్క‌డో కాదు.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్రాంతంలో.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా నిలిచేందుకు తెలంగాణ కాంగ్రెస్ అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. ఒక‌వైపు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను నిల‌దీస్తూనే.. మ‌రోవైపు వేగంగా దూసుకువ‌స్తున్న బీజేపీని నిలువ‌రించేందుకు తీవ్రంగానే ప్ర‌య‌త్నిస్తోంది. పార్టీ అధ్యక్షుడు రేవంత్ అధిష్ఠానం అండ‌తో జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ పార్టీ బ‌లోపేతం కోసం ముంద‌డుగులు వేస్తున్నారు. కానీ గ్రూపు త‌గాదాల వ‌ల్ల న‌గరాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు.

ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. ఒక‌పుడు పీజేఆర్‌, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, వీ హ‌నుమంత‌రావు, ముఖేష్ గౌడ్‌, స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌ లాంటి మ‌హామ‌హులు ఏలిన ఈ ప్రాంతంలో ఇపుడు పోటీకి స‌రైన అభ్య‌ర్థులే దొర‌క‌డం లేదు. కొంద‌రు ఇత‌ర పార్టీల్లోకి వ‌ల‌స వెళ్ల‌డం.. ఉన్న కొంత మంది సీనియ‌ర్లు సైలెంట్ అయిపోవ‌డంతో పార్టీ ప‌రిస్థితి చుక్కాని లేని నావ‌లా త‌యారైంది. ప్ర‌స్తుతం న‌గ‌రానికి పెద్ద దిక్కుగా ఉన్న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అంజ‌న్ కుమార్ యాద‌వ్ పై పార్టీ శ్రేణుల‌కు న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో పార్టీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింది.

ముఖ్యంగా మునుపు దేశంలోనే అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఖైర‌తాబాద్ నుంచి ప్రాతినిథ్యం వ‌హించిన పీజేఆర్ మ‌ర‌ణం త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకున్న వారే లేరు. జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ త‌న‌యుడు విష్ణు ఉన్నా ఆయ‌న సీరియ‌స్ పాలిటిక్స్ చేయ‌డం లేదు. ఆయ‌న పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియ‌డం లేద‌ని శ్రేణులు చ‌ర్చించుకుంటున్నాయి. త్వ‌ర‌లో బీజేపీలో చేర‌తాడ‌నీ అంటున్నారు. అలాగే కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా స‌రైన నాయ‌కుడు లేరు.

శేరిలింగంప‌ల్లి నుంచి గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌పున‌ ప్రాతినిథ్యం వ‌హించిన భిక్ష‌ప‌తి యాద‌వ్ ఆయ‌న కుమారుడు ఇపుడు బీజేపీలో ఉన్నారు. ఇక్కడా పార్టీకి స‌రైన అభ్య‌ర్థి లేరు. కుత్బుల్లాపూర్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీ‌శైలం గౌడ్ కూడా బీజేపీలో చేర‌డంతో ఇక్క‌డా పార్టీ అనాథ‌గానే ఉంది. అలాగే గోషామ‌హ‌ల్ కూడా గ‌తంలో కాంగ్రెస్ ఖాతాలోనే ఉండేది. దానినీ బీజేపీకి స‌మ‌ర్పించుకున్నారు.

అలాగే ఎల్బీన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట‌, అంబ‌ర్ పేట‌, కంటోన్మెంట్, ఉప్ప‌ల్‌, మేడ్చ‌ల్, చేవెళ్ల త‌దిత‌ర స్థానాల్లో ఆ పార్టీకి స‌రైన నాయ‌క‌త్వం లేకుండా పోయింది. ఎన్నిక‌లకు ఏడాదిన్న‌ర కూడా లేక‌పోవ‌డంతో ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఉన్న దాదాపు 15 నుంచి 20 స్థానాల‌ను బీజేపీకి పువ్వుల్లో పెట్టి ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఆయా స్థానాల‌పై రేవంత్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి.
Tags:    

Similar News