విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌..అమెరికాలో చ‌దువుల కోసం యాప్‌

Update: 2019-06-12 15:20 GMT
అమెరికాలో విద్యాభ్యాసం అనే క‌ల‌ను నెర‌వేర్చుకునే క‌ల‌లో అనేక‌మంది విద్యార్థులు న‌కిలీ యూనివ‌ర్సిటీల బారిన ప‌డి మోస‌పోయిన సంగ‌తి తెలిసిందే. అయితే, అలా గ‌తంలో భార‌తీయ విద్యార్థులు బ‌లైన‌ట్లే భ‌విష్య‌త్తులో ఇత‌రులు న‌ష్ట‌పోకుండా ఉండే అవ‌కాశం అమెరికా అధికారులు క‌ల్పించారు. అమెరికాలో విద్యాభ్యాసం చేయాల‌నుకునే విద్యార్థుల కోసం భార‌త‌దేశంలోని అమెరికా రాయ‌బార కార్యాల‌యం నూత‌నంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. భార‌తీయ విద్యార్థుల కోసం ఈ నూత‌న సౌల‌భ్యం అందుబాటులోకి తెచ్చిన‌ట్లు రాయ‌బార కార్యాల‌య డిప్యూటీ క‌ల్చ‌ర‌ల్ ఎఫైర్స్ ఆఫీస‌ర్ కార్ల్ ఎం ఆడ‌మ్  వెల్ల‌డించారు. ఈ యాప్‌ ను బుధ‌వారం ఆవిష్క‌రించారు.

ఎడ్యుకేష‌న్ యూఎస్ ఏ పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి స‌మ‌గ్ర‌మైన మ‌రియు ఖ‌చ్చిత‌మైన స‌మ‌చారం ల‌భ్య‌మ‌వుతుంది. ఈ యాప్‌ లోని స‌మాచారం అంతా త‌మ ఫేస్‌ బుక్ పేజీలో సైతం పొందుప‌రిచిన‌ట్లు రాయ‌బార కార్యాల‌య డిప్యూటీ క‌ల్చ‌ర‌ల్ ఎఫైర్స్ ఆఫీస‌ర్ కార్ల్ ఎం ఆడ‌మ్ వివ‌రించారు. ప్ర‌స్తుతం ఎడ్యుకేష‌న్ యూఎస్‌ కు ఏడు స‌ల‌హా కేంద్రాలున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ఢిల్లీ - ముంబై - కోల్‌ క‌తా - చెన్నై - హైద‌రాబాద్‌ - బెంగ‌ళూరు మ‌రియు అహ్మాదాబాద్‌ ల‌లో ఈ కేంద్రాలు ఉన్నాయని ఆయ‌న పేర్కొన్నారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న వారిలో తొలి స్థానంలో చైనా దేశానికి చెందిన వారుండ‌గా...రెండో స్థానంలో భార‌తీయ విద్యార్థులున్నారు. మొత్తం విద్యార్థుల్లో భార‌తీయుల సంఖ్య దాదాపు 17 శాతానికి పైగా ఉండ‌గా - వారి ద్వారా ప్ర‌తి ఏటా $7.5 బిలియ‌న్లు అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు స‌మ‌కూర్చుతున్నారు.

అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న‌ ప్ర‌తి ఐదుగురు విదేశీ విద్యార్థుల్లో ఒక‌రు భార‌తీయుడే. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల కాలంలో, అమెరికాలో విద్యాభ్యాసం కోసం న‌మోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయింది. 2017లో అమెరికాలో విద్యాభ్యాసం కోసం న‌మోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1,82,000 కాగా 2018లో వీరి సంఖ్య 1,96,000కు చేరింది. విద్యార్థుల వీసా ఆమోదం 90% చేరింది. అమెరికాలో దాదాపు 4700 విద్యాసంస్థ‌లు ఉండ‌గా...మెజార్టీ విద్యార్థులు కేవ‌లం 300 విద్యాసంస్థ‌ల్లోనే అడ్మిషన్ల‌కు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌ని ఆడమ్‌ వెల్ల‌డించారు.


Tags:    

Similar News