అఫ్గాన్ లో అమెరికా పెట్టిన ఖర్చు లెక్క బయటకు వచ్చింది

Update: 2021-09-01 04:30 GMT
అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంత అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నది 9/11 దాడులు. ఈ ఉదంతంలో దాదాపు మూడు వేల మంది అమెరికన్లు మరణించారు. తమపై జరిగిన ఉగ్రదాడికి ఉడికిపోయిన అగ్రరాజ్యం.. దానికి బదులు తీర్చుకునేందుకు 2001 సెప్టెంబరు 18న ఉగ్రవాదంపై సైన్యాన్ని ప్రయోగించేందుకు వీలుగా అమెరికా చట్టసభలు ఆమోదం తెలిపాయి. దీంతో.. అఫ్గాన్ లోని తాలిబన్ల సంగతి చూసేందుకు అడుగుపెట్టిన వారు ఏకంగా ఇరవైఏళ్ల పాటు ఆ దేశంలో ఉండిపోయారు. తాలిబన్ల పీచమణచటానికి వారు ఎంతలా ప్రయత్నించినా.. రెండు దశాబ్దాల అనంతరం వారి చేతుల్లోకి అఫ్గాన్ ను పెట్టి.. ఉత్త చేతలతో విడిచి పెట్టి రావాల్సిన పరిస్థితి.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఒక విషాదానికి బదులు తీర్చుకోవటానికి అప్గాన్ లోకి అడుగు పెట్టిన అమెరికా సైన్యం చివరకు.. అదే తరహా విషాదంతో వెనుదిరగటం. ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికా.. అఫ్గాన్ విషయంలో సాధించిన దాని కంటే కోల్పోయిందే ఎక్కువన్న మాట వినిపిస్తూ ఉంటుంది. చివరకు చేతులు ఊపుకుంటూ తిరిగి వెళ్లే వైనాన్ని.. ప్రపంచంలోని చాలా దేశాలు.. అక్కడి ప్రజలు తిట్టి పోస్తున్న పరిస్థితి. ఏదో చేద్దామని వచ్చి.. ఏదేదో చేసేసి.. ఇంకేం చేయాలో తోచక.. చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయారన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

మరెప్పుడూ లేనంత దారుణ పరాభవంతో అమెరికాకు వెళ్లిపోయినట్లు చెబుతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గడిచిన ఇరవై ఏళ్లలో అఫ్గాన్ లో పెట్టిన ఖర్చు లెక్క వింటే దిమ్మ తిరిగిపోవటం ఖాయం. తాజాగా వెలువడుతున్న అంచనాల ప్రకారం 2.313 ట్రిలియన్ డాలర్లుగా తేల్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రపంచం ఒక్కసారిగా అవాక్కు అవుతోంది. ఎందుకంటే.. మన రూపాయిల్లో చూస్తే..రూ.1.6 కోట్ల కోట్లుగా తేల్చారు.

అఫ్గాన్ లో అమెరికన్లు వేలాది కోట్లు ఖర్చు పెట్టి అంతకు మించిన మరేదో సాధించినట్లుగా ప్రచారం సాగుతూ ఉన్నా.. అదెంత మాత్రంనిజం కాదన్న మాట తాజాగా వినిపిస్తోంది. ఎందుకంటే.. తాజా ఖర్చు ఊహకు అందనిదిగా చెప్పాలి. రూ.1.6 కోట్ల కోట్లు అంటే.. ప్రపంచ దేశాల ప్రజల అంచనాకు సైతం అందనిదిగా చెప్పాలి. డబ్బుల పరంగా ఇదొక లెక్క అయితే.. అఫ్గాన్ లో అమెరికన్ సైన్యం దాదాపు 2400 మంది మిలిటరీ సిబ్బందిని కోల్పోయింది. ఇక.. గాయాలపాలైన వారు చాలామందే ఉన్నారని చెబుతారు.

ఇంతమందిని బలి పెట్టి.. కోట్ల.. కోట్ల రూపాయిల్ని ఖర్చు చేసిన అమెరికా.. అఫ్గాన్ ను విడిచి పెట్టి వెళ్లేటప్పుడు.. ఎప్పటికి పనికి రాని రీతిలో జీపుల్లా ఉండే 27 వాహనాలు.. 73 సైనిక విమానాల్ని అమెరికా మిలిటరీ సిబ్బంది అక్కడికక్కడే ధ్వంసం చేసి విడిచి పెట్టి వచ్చేశారు. వీటిని తాలిబన్లు ఎప్పటికి వాడలేరని చెబుతున్నారు. మొత్తంగా తన ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి భారీగా ఖర్చు చేసిన అమెరికా.. వేలాది మంది తన సైనికుల్ని కోల్పోయి.. అనుకున్నది సాధించలేని అమెరికా తీరు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News