వైఫ్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేయరట!

Update: 2019-06-06 06:45 GMT
హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి  ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నల్లగొండ నుంచి ఎంపీగా నెగ్గడంతో ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఎంపీగా కొనసాగడం కోసం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఆయన రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పవు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న సీట్లు అంతంత మాత్రమే. ఇప్పటికే ఎమ్మెల్యేలు కొంతమంది జారిపోయారు. మిగిలింది కొంతమంది మాత్రమే.

అయినా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సీటుకు బై పోల్ నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హుజూర్  నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పోటీ చేస్తుందనే ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. తన భార్య ఎమ్మెల్యేగా పోటీ చేయదని ఆయన స్పష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికలప్పుడు  హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టి పోటీనే ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మీద ఆయన ఏడు వేలకు పై చిలుకు ఓట్ల తేడాతో నెగ్గారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ సీటు నుంచి కాంగ్రెస్ కు ఏ మేరకు అవకాశాలుఉంటాయనేది ప్రశ్నార్థకమే.

ఆ సీటును కైవసం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి గట్టిగా పోరాడే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో తన భార్యను అక్కడ నుంచి పోటీ చేయించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెనుకంజ వేశారు. ఇంతకీ కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారో!
Tags:    

Similar News