మీది క‌ష్టం.. బీజేపీది ల‌క్కీలాట‌రీనా ఉత్త‌మ్?

Update: 2019-05-29 05:26 GMT
గెలుపులోనూ వేద‌న ఉంటుందా? అంటే లేద‌నే చెబుతారు. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల తీరు చూస్తే.. ఇదెంత నిజ‌మ‌న్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు. త‌మ గెలుపు కంటే బీజేపీ నేత‌లు ఘ‌న విజ‌యం తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు ఇప్పుడో పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. కేసీఆర్ స‌ర్కారు వ్య‌తిరేక‌తతో లాభ‌ప‌డాల్సింది తాము మాత్ర‌మే త‌ప్పించి బీజేపీ కానే కాద‌న్న‌ది ఉత్త‌మ్ అండ్ కో వారి భావ‌న‌. అందుకు భిన్నంగా త‌మ‌కు మూడు సీట్లు.. బీజేపీకి ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవ‌టాన్ని వారు ఒక ప‌ట్టాన జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఈ కార‌ణంతోనే.. తెలంగాణ‌లో బీజేపీ గెలుపును ల‌క్కీ లాట‌రీగా తీసి పారేస్తున్నారు ఉత్త‌మ్‌. ఇప్ప‌టివ‌ర‌కూ క‌మ‌ల‌నాథుల‌కు తెలంగాణ ఒక ట‌ఫ్ న‌ట్ గా ఫీల‌య్యే వారు. కానీ.. త‌మ‌కు బేస్ ఉంద‌ని.. కాకుంటే కాస్త క‌ష్ట‌ప‌డితే సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేయొచ్చ‌న్న ధైర్యాన్ని.. న‌మ్మ‌కాన్ని క‌లిగించాయి తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు.

తెలంగాణ మీద ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద‌గా ఆశ‌లు లేని బీజేపీ నేత‌ల‌కు.. తాజా ఫ‌లితాలు కొత్త ఆశ‌లు చిగురించేలా చేయ‌ట‌మే కాదు.. ఇక‌పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రాన్ని చెప్పిన‌ట్లైంది తాజా ఫ‌లితం.

దీంతో.. కాంగ్రెస్ నేత‌ల‌కు ఈ వ్య‌వ‌హారం పెద్ద దిగులుగా మారింది. బీజేపీ గెలుపును వీలైనంత త‌క్కువ చేసే ప్ర‌య‌త్నాన్ని ఆయ‌న షురూ చేశారు. అందులో భాగంగానే తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు ల‌క్కీ లాట‌రీగా ఉత్త‌మ్ అభివ‌ర్ణిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ విజ‌యం మీద అసూయ ఉండ‌టం త‌ప్పేం కాదు. కానీ.. వారిని చిన్న‌బుచ్చేలా.. వారిని ఎన్నుకున్న ఓట‌ర్ల‌ను నొచ్చుకునేలా మాట్లాడ‌టం స‌రికాదు. స‌రిగా క్యాడ‌ర్ లేని చోట్ల కూడా బీజేపీ విజ‌యం సాధించ‌టం అంటే.. వారి విష‌యంలో ఓట‌ర్లకు ఉన్న న‌మ్మ‌కాన్ని చెబుతుంది.

అదే స‌మ‌యంలో దారుణ ఓట‌మి త‌ర్వాత‌.. ఊహించ‌ని రీతిలో విజ‌యాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. తాము ఏ రీతిలో అడుగులు వేస్తే కేసీఆర్ అండ్ కోను క‌ట్ట‌డి చేయొచ్చ‌న్న అంశంపై దృష్టి సారించేలా కానీ.. చిన్న‌బుచ్చేలా మాట్లాడే మాట‌లు ఉత్త‌మ్ అండ్ కో మీద గౌర‌వాన్ని త‌గ్గిస్తుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.  గెలుపు మీద ఫోక‌స్ ఉండాలే కానీ.. ప‌క్క‌నోడి విజ‌యాన్ని త‌క్కువ చేయ‌టం ద్వారా గెలిచిపోమ‌న్న విష‌యాన్ని ఉత్త‌మ్ మ‌ర్చిపోకూడ‌దు. బీజేపీ విజ‌యం మీద అదే ప‌నిగా ఫీల‌య్యే క‌న్నా.. త‌మ‌కున్న అవ‌కాశాల మీద మ‌రింత ఫోక‌స్ పెడితే సానుకూల ఫ‌లితానికి అవ‌కాశం ఉంటుంది. ఇంత చిన్న విష‌యాన్ని ఉత్త‌మ్ అండ్ కో ఎందుకు మిస్ అవుతున్న‌ట్లు?
Tags:    

Similar News