ఉత్త‌మ్ జీవితంలో ఇన్ని మ‌లుపులు ఉన్నాయా?

Update: 2018-01-24 10:10 GMT
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌స్థానం చాలా ఆస‌క్తిక‌ర‌మ‌న్న విష‌యం తెలిసిందే గానీ... ఆయ‌న జీవితంలో ఎన్ని మ‌లుపులు ఉన్నాయన్న విష‌యం మాత్రం చాలా కొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. ఈ మ‌లుపుల జీవితాన్ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఏనాడూ బ‌య‌ట‌పెట్ట‌లేదు గానీ... ఇటీవ‌ల ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అవ‌న్నీ దాదాపుగా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయ‌నే చెప్పాలి. ఉత్త‌మ్ జీవితంలో చోటుచేసుకున్న మ‌లుపుల గురించి వింటే... అంత విత‌ప్క‌ర ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న ఎలా రాణించారు అన్న అనుమానాలు క‌లుగ‌క మాన‌వ‌నే చెప్పాలి. మ‌లుపుల  మ‌యంగా ఉన్న త‌న జీవితాన్ని ప్రస్తావించిన ఉత్త‌మ్‌... ఇప్పుడు తాను అనుభ‌విస్తున్న జీవితం త‌న‌కు బోన‌స్‌ గా ల‌భించిన‌దేన‌ని చెబుతున్నారు. త‌న‌ది బోన‌స్ జీవిత‌మ‌ని ఉత్త‌మ్ ఎందుకు చెప్పారంటే... ఆయ‌న జీవితంలో చోటుచేసుకున్న కీల‌క మ‌లుపుల‌ను తెలుసుకుని తీరాల్సిందే.

ఆ వివ‌రాల్లోకి వెళితే...  రాజకీయాల్లోకి రాక ముందు ఇండియన్ వాయుసేనలో పైలెట్ ఆఫీసర్‌ గా - క్లాస్ వన్ గెజిటెడ్ ఆఫీసర్‌ గా ఉత్త‌మ్ చేరారు. 16 ఏళ్ళ వయస్సులోనే ఆయ‌న‌ పూణెలోని డిఫెన్స్ అకాడమీలో సైనిక శిక్షణ పొందారు. అయితే బోర్డర్ సమీపంలో విమానంలో వెళుతున్న సమయంలో తాను ప్ర‌యాణిస్తున్న‌ విమానం గాల్లోనే పేలిపోయింది. అది సింగిల్ పైలెట్ విమానం. ఈ విమానంలో ఆయ‌న‌ ఉన్న సమయంలోనే విమానం పేలిపోయిందట‌. ఈ త‌ర‌హా ప్ర‌మాదాల్లో విమానంలో ఉన్న పైల‌ట్ బ‌తికి బ‌య‌ట ప‌డ‌టం దాదాపుగా దుస్సాధ్య‌మే. అయితే యుద్ధ విమానంలో ఎజెక్షన్‌ అనే బటన్‌ ఉంటుంది. దాన్ని నొక్కితే విమానం నుంచి సీట్‌ తో సహా పైలట్‌ ను అలా ఎగిరి బ‌య‌ట ప‌డిపోతార‌ట‌. ఈ విష‌యంపై పూర్తి అవ‌గాహ‌న ఉన్న ఉత్త‌మ్‌... ప్ర‌మాదం జ‌రిగిన విమానంలో ఉండి కూడా ఆ విష‌యాన్ని గుర్తు చేసుకుని మ‌రీ ఆ బ‌ట‌న్‌ ను ప్ర‌యోగించార‌ట‌. దీంతో పేలిపోయిన విమానం నుంచి బ‌య‌ట‌ప‌డిపోయిన ఉత్త‌మ్‌... పారాచూట్‌ సాయంతో సమీపంలోని అడవుల్లో పడ్డార‌ట‌. ఆ ప్రమాదం నుండి పది లక్షల మందిలో ఒకరు కూడ బతకడం చాలా అరుదని రష్యన్ నిపుణులు చెప్పారని నాటి జ్ఞాప‌కాల‌ను ఉత్తమ్ గుర్తు చేసుకొన్నారు.

ఈ ప్రమాదం నుండి కోలుకోవడానికి ఉత్త‌మ్‌కు ఆరు మాసాలు పట్టిందట‌. ఆ ప్రమాదంలో ఉత్త‌మ్‌ వెన్నెముక విర‌గ‌డంతో పాటుగా మోకాలు ఫ్రాక్చర్‌ అయింట‌. మళ్ళీ ఇదే తరహ ప్రమాదంలో చిక్కుకొంటే వెన్నెముక పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు సూచించారని ఉత్తమ్ చెప్పారు. దీంతో పైలెట్ బాధ్యతల నుండి తప్పుకోవాల్సి వచ్చిందని ఆయ‌న పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకున్నారు. దీంతో ఆ సమయంలో ఎయిర్ చీఫ్ మార్షల్ గా ఉన్న త‌న పై అధికారి అప్పటి భారత రాష్ట్రపతి వెంకట్రామన్‌ను సంప్రదించి పీస్ పోస్టింగ్ ఉద్యోగాన్ని ఇప్పించారని ఉత్తమ్ చెప్పారు. తర్వాత తన మిలటరీ హోదాను మార్చి ఐఎఎస్ హోదాకు మార్చి రాష్ట్రపతి వద్ద శాశ్వత ఉద్యోగిగా మార్చారని ఆయ‌న‌ గుర్తు చేసుకొన్నారు.అంత పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ ఉత్త‌మ్‌... రాష్ట్రప‌తి వ‌ద్ద ఉద్యోగానికి రాజీనామా చేసేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌ధిగా ఉన్నారు. ఇంత‌టి కీల‌క ప‌దవిలో ఉన్న ఉత్త‌మ్‌కు ఎదురైన ప్ర‌మాదం వింటే నిజంగానే ఆయ‌న జీవితం మ‌లుపుల‌మ‌య‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News