ఉత్త‌మ్ సార్‌!... టూ మ‌చ్ అనిపిస్త లేదా?

Update: 2019-02-17 14:00 GMT
ఇటీవ‌లే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు త‌న సిద్ధాంతాల‌ను అట‌కెక్కించి పొత్తుకు క‌లిసి వ‌చ్చినా... కాంగ్రెస్‌ కు వీల‌స‌మంతైనా మేలు జర‌గ‌క‌పోగా... కీడే ఎక్కువ‌గా జరిగింది. తెలంగాణ‌పై రెండు నాల్క‌ల ధోర‌ణితో ముందుకు సాగిన చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్‌ కు ఉన్న క్రెడిట్ కూడా గంగ‌లో క‌లిసిపోయింద‌నే చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కంటే ఈ ఎన్నిక‌ల్లో అతి తక్కువ సీట్లు రావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. అయినా కేసీఆర్ సాగించిన సంక్షేమ పాల‌న‌, ఎన్నిక‌ల ముందు ప్ర‌వేశ‌పెట్టిన రైతు బంధు ప‌థ‌కం ముందు కాంగ్రెస్ చెప్పి ఏ ఒక్క మాట కూడా ఓట‌ర్ల చెవుల‌కు ఎక్క‌లేద‌నే చెప్పాలి.

ఈ ఓట‌మి నుంచి తేరుకునేందుకు చాలా స‌మ‌య‌మే తీసుకున్న టీ కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు పార్టీ యంత్రాంగాన్ని స‌మాయత్తం చేసేందుకంటూ వ‌రుస మీటింగుల‌తో బిజీబిజీగా మారిపోయిన టీ కాంగ్రెస్ చీఫ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. శాస‌న‌సభ ఎన్నిక‌ల్లో త‌గిలిన దెబ్బ‌ల‌ను అప్పుడే మ‌రిచిపోయిన ఉత్త‌మ్‌... ఈ ద‌ఫా కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు మాట్లాడిన‌ట్టుగా త‌న‌దైన శైలిలో కాంగ్రెస్ ను ఓ వీరాధి వీర పార్టీగా చూపించేసి... కాంగ్రెస్ పార్టీకి ఘోర ప‌రాభ‌వాన్ని చ‌విచూపించిన టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావును చాలా ఈజీగా తీసి పారేశారు.

అస‌లు లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఫ్యాక్ట‌ర్ గానీ, కేసీఆర్ ఫ్యాక్ట‌ర్ గానీ ఏవీ ప‌నిచేయ‌వ‌ని, లోక్ స‌భ పోటీ మొత్తం కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్యేన‌ని ఆయ‌న తేల్చేశారు. కేసీఆర్ ఫ్యాక్ట‌ర్ ఒక్క అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆ ఫ్యాక్ట‌ర్ నామ‌మాత్ర‌మేన‌ని, ఎలాగూ బీజేపీ తెలంగాణ‌లో కొన్ని ప్రాంతాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని, ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని దాదాపుగా 17 పార్ల‌మెంటు స్థానాలు త‌మ‌వేన‌న్న రీతిలో భారీ క‌ల‌రింగే ఇచ్చారు. చెప్పుకోవ‌డానికి, విన‌డానికి ఈ మాట‌లు బాగానే ఉన్నాయి గానీ... గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలి ఇంకా నెల‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే... ఉత్త‌మ్ నోట ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఆ పార్టీని ఏ తీరాల‌కు తీసుకుని వెళ‌తాయో చూడాలి.
Tags:    

Similar News