వైఎస్ ఫార్ములాను న‌మ్ముకొని రంగంలోకి ఉత్త‌మ్‌

Update: 2018-02-25 23:29 GMT
దివంగ‌త ముఖ్య‌మంత్రి - కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయ‌కుడిగా ఎదిగిన నేత వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి ఫార్ములానే తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి న‌మ్ముకున్నార‌ని అంటున్నారు. అచ్చూ ఆయ‌న లాంటి స్కెచ్చుతోనే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ఉత్త‌మ్ బాట‌లు వేస్తున్నార‌ని అయితే అది ఎంత‌మేర‌కు ఫ‌లితం ఇస్తుందో వేచి చూడాలని చెప్తున్నారు! ఇదంతా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేప‌ట్టునున్న బ‌స్సుయాత్ర గురించి. ప్రజా చైతన్య బస్సుయాత్ర పేరుతో ఉత్త‌మ్ మొద‌లుపెట్టిన టూరు గురించి రాజ‌కీయ‌వ‌ర్గాలు ఈ విశ్లేష‌ణ చేస్తున్నాయి.

2004 ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్ రంగంలోకి దిగిన‌ట్లే నేడు ఉత్త‌మ్ సైతం ఎంట్రీ ఇస్తున్న‌ట్లు పేర్కొంటున్నారు. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాగైతే కాంగ్రెస్ నేత‌ల్లో అధికార కాంక్ష ఉన్న‌ప్ప‌టికీ అంతా ఏక‌తాటిపైన లేక‌పోవ‌డం, అలాంటి వారి మ‌ధ్య ఐక్య‌త‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం వైఎస్ తీసుకున్న‌ట్లే...తాజాగా ఉత్త‌మ్ అదే ప‌ని చేస్తున్నార‌ని వివ‌రిస్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్రవ్యాప్త యాత్ర‌కు వైఎస్ సిద్ధ‌మ‌యిన‌ట్లే...నేడు ఉత్త‌మ్ సైతం ముంద‌డుగు వేస్తున్నార‌ని చెప్తున్నారు. అయితే వైఎస్‌ది పాద‌యాత్ర కాగా - ఉత్త‌మ్‌ ది బ‌స్సుయాత్ర అని గుర్తుచేస్తున్నారు. ఈ ఇద్ద‌రు త‌మ‌యాత్ర‌ను చేవెళ్ల నుంచే మొద‌లుపెడుతున్నార‌ని వివ‌రిస్తున్నారు.

కాగా, టీఆర్‌ ఎస్‌ ఎన్నికల హామీలు.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంతో జరుగుతున్న మోసాన్ని ప్రజలకు చెప్పేందుకు టీపీసీసీ తలపెట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్ర సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభ తర్వాత బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. ఆదివారం ఈమేరకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బస్సుయాత్ర షెడ్యుల్‌ ప్రకటించారు. 26న ప్రారంభం కానున్న బస్సుయాత్రను హోలిపండుగ సందర్భంగా మూడు రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత మార్చి 9 వరకు యాత్ర కొనసాగుతుందని ఆయన చెప్పారు. నాలుగేండ్ల కేసీఆర్‌ పాలనలో ప్రజా సంక్షేమం లేదని ఉత్త‌మ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రజా చైతన్య బస్సు ద్వారా కేసీఆర్‌ నియంత, కుటుంబ పాలనకు పరిమితమైందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రూ 3 వేల నిరుద్యోగ భతి ఇస్తామని హామీ ఇచ్చారు.
Tags:    

Similar News