కేసీఆర్ ఏం చేయ‌నున్నాడో చెప్తున్న ఉత్త‌మ్

Update: 2018-02-26 16:28 GMT
తెలంగాణ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స‌ర్కారు తీరును ఎండ‌గ‌ట్టేందుకు టీపీసీసీ ర‌థ‌సార‌థి ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ప్ర‌జా చైత‌న్య‌యాత్ర పేరుతో బ‌స్సు యాత్ర‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌ కు క‌లిసివ‌చ్చిన చేవేళ్ల నుంచే ఈ యాత్ర ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ స‌హా కాంగ్రెస్ నేత‌లు ప్ర‌సంగించారు. అయితే త‌న యాత్ర‌పై ప్ర‌త్యేక దృష్టి కేంద్రీకరించేలా ఉత్తమ్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు.

గతంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేవెళ్ల నుండి పాదయాత్ర ప్రారంభించి అధికారంలోకి తెచ్చార‌ని చేవెళ్ల సెంటిమెంట్ తో ఇక్కడినుండి బస్సుయాత్ర మొదలుపెట్టాన‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వివ‌రించారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన - రాష్ట్రంలో అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయం పై ఈ యాత్రలో ఎండగడుతాన‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ ప్రజలు కలలుకన్న తెలంగాణ పాలన ఇది కాదని ఆయ‌న‌ మండిప‌డ్డారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదని ఆరోపించారు. దళితులు - గిరిజనులను కెసిఆర్ ప్రభుత్వం మోసం చేసిందని విరుచుకుప‌డ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. బీసీల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంద‌ని పీసీసీ ర‌థ‌సార‌థి ఆరోపించారు. జనాభా ప్రాతపదికన రిజర్వేషన్ లు అమలుఅయ్యే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు -  నిరుద్యోగులను టీఆర్ ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిప‌డ్డారు. భారతదేశంలో ఎక్కడా జరగని అవినీతి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంద‌ని ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తామ‌ని ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. రైతు పండించిన పంటలు క్వింటాల్  వరికి 2 వేలు - పత్తి 6వేలు - పసుపు 10వేలకి కొనుగోలు చేస్తామ‌ని తెలిపారు. మహిళలని టీఆర్ ఎస్‌ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. 70లక్షల స్వ‌యం స‌హాయ‌క సంఘం సభ్యులకి - డ్వాక్రా గ్రూపులకు ప్రతి సంఘానికి లక్ష రూపాయల గ్రాంట్ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్రతి మహిళా సంఘానికి 10లక్షల రూపాయలు ప్రోత్సాహం - వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. నిరుద్యోగ విద్యార్థులకి నెలకి 3వేల రూపాయల భృతి చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అమలుచేస్తామ‌ని రంగారెడ్డి జిల్లాలో వున్న అన్ని సమస్యలని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తీరుస్తామ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ వస్తే రైతులు - యువత -నిరుద్యోగులు - మహిళలు మా బ్రతుకులు బాగుబడతాయి అని ఎంతో ఆశగా ఎదురు చూశారని అయితే బంగారు తెలంగాణ అని ప్ర‌క‌టిస్తూ... బంగారు కుటుంబంగా కేసీఆర్ కుటుంబం మాత్రమే అయిందని ఆరోపించారు. అందరికి ఉద్యోగాలు అన్న కేసీఆర్ - కేవలం తన కుటుంబంలోని ముగ్గ‌రికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడని ఆరోపించారు. ఇప్పుడు ఇంకో కుటుంబ సభ్యున్ని రాజ్యసభకు పంపించ డానికి సిద్దం అయ్యాడని ఆరోపించారు. త‌ద్వారా త్వ‌ర‌లో కేసీఆర్ కుటుంబ స‌భ్యుడిని రాజ్య‌స‌భ‌కు పంపించ‌బోతున్నార‌నే అంశాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమ‌ని ఉత్త‌మ్ ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలమంతా ఐక్యంగా వుండి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News