వాళ్ల‌కు చంద్ర‌బాబు అన్యాయం చేశారు

Update: 2015-12-11 09:55 GMT
ఉత్త‌రాంధ్ర జిల్లాలు .. ఆంధ్ర‌ప్ర‌దేశ్ చిత్ర‌ప‌టంలో బాగా వెనుకుండే జిల్లాలు. అదే వాటి అభివృద్ధికి అవ‌రోధంగా మారింది. ఇన్నేళ్ల‌యినా అవి వెనుక‌బాటు జిల్లాలుగానే ఉండిపోతున్నాయి. అభివృద్ధిలో ఎప్పుడూ వెన‌క‌ప‌డి ఉండే ఉత్త‌రాంధ్ర జిల్లాల విష‌యంలో పాల‌కులు కూడా ఎప్పుడూ శీత‌క‌న్నే ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర జిల్లాకు ఏ ప్ర‌భుత్వ పాల‌న‌లో అయినా మంచి ప‌ద‌వులు రావు. ఇక అభివృద్ధి, నిధులు విష‌యంలో కూడా ఆ జిల్లాల‌పై అదే నిర్ల‌క్ష్యం కనిపిస్తుంటుంది. ఉత్త‌రాంధ్ర‌లో ఒక్క విశాఖ న‌గ‌రం మిన‌హా మిగిలిన జిల్లాలు అభివృద్ధిలో చాలా వెన‌క‌బాటుకు గుర‌య్యాయి.

ఇప్పుడు ఇదే ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో టీడీపీలో నామినేటెడ్ చిచ్చు రేగుతోంది. ఒక ప్రాంతం నాయ‌కుల‌కే అవ‌న్నీ ద‌క్క‌డంతో ఉత్త‌రాంధ్ర జిల్లాల టీడీపీ నాయ‌కుల్లో కొందరు నిరాశ‌గా ఉన్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టులపై ఉత్తరాంధ్ర తెలుగు దేశం నేతలు - కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని సమాచారం. ఈవిష‌యంపై  మంత్రులు గంటా - అయ్యన్నపాత్రుడు - కిమిడి - అచ్చెన్నాయుడుల వద్ద కార్యకర్తలు బాహాటంగా నిరసన వ్య‌క్తంచేస్తున్నార‌ట‌. మొన్న ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క పోస్టు కూడా ఉత్తరాంధ్రకు ఇవ్వకపోవడమే వీరి అసంతృప్తి కారణమట..కష్టకాలంలోనూ పార్టీకి అండగా నిలబడుతున్న ఉత్తరాంధ్రపై అధినేత శీతకన్ను వేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి..

ఇటీవ‌ల చంద్ర‌బాబు మొత్తం 8 నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తే అందులో 4 కృష్ణా జిల్లాకు ఇవ్వగా, జూపూడి ప్రకాశం జిల్లా - లింగారెడ్డి కడప జిల్లా - జయరామిరెడ్డి చిత్తురూ జిల్లా - మరొకటి అనంతపురం జిల్లాకి కేటాయించారు..ఉత్తరాంధ్ర - కోస్తా నుంచి ఎవరికీ అవకాశమివ్వలేదన్న వాద‌న‌లు ఇప్పుడు మంత్రుల వద్ద చర్చకు వస్తున్నాయి. టీటీడీ బోర్డుకు వేసిన ఎవి.రమణ పోస్టు మినహా ఇంతవరకు ఒక్కటీ ఉత్త‌రాంధ్ర‌కు కేటాయించలేదన్న వాదన విన్పిస్తోంది. దీంతో చంద్ర‌బాబుపై ఇప్పుడు ఉత్త‌రాంధ్ర టీడీపీ నేత‌లు పైకి చెప్పుకోక‌పోయినా లోలోన తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ట‌. వీరి అసంతృప్తిని ఉత్త‌రాంధ్ర మంత్రులు చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ‌తామ‌ని హామీ ఇచ్చి తాత్కాలికంగా వారిని స‌ముదాయిస్తున్నార‌ట‌.
Tags:    

Similar News