షాకింగ్: హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో 2200మంది పోటీ

Update: 2021-08-05 08:50 GMT
హుజూరాబాద్ అధికార పార్టీకి చుక్కలు చూపించేలా అసమ్మతివాదులు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వారంతా ఇప్పుడు హుజూరాబాద్ పై పడిపోతున్నారు. ఈ క్రమంలోనే తమ నిరసనను దేశవ్యాప్తంగా తెలియజేసేందుకు హుజూరాబాద్ ను టార్గెట్ చేస్తున్నారు.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో 2200 మంది తమ నామినేషన్లను దాఖలు చేసే అవకాశం ఉంది. అనేక గ్రూపులు చాలా మంది అభ్యర్థులను ఉంచాలని నిర్ణయించుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.

ఈసారి ఇంత మంది పోటీతో ఈవీఎంలు వాడడం ఈసీ వల్ల కాదని.. అందుకు బదులుగా పేపర్ బ్యాలెట్ ను సిద్ధం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటికే తెలంగాణప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న ఆర్యవైశ్యులు, ఎంపీటీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, నేత సంఘం, మధ్యమానేరు ప్రాజెక్ట్ తొలగింపుదారులు ,ప్రైవేటు లెక్చరర్లకు సంబంధించిన అసోసియేషన్లు హుజూరాబాద్ లో నామినేషన్లు దాఖలు చేయడానికి యోచిస్తున్నాయి.

ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ప్రతి అభ్యర్థి ఒక అభ్యర్థిని మాత్రమే ప్రతిపాదించాలి. ఒక వ్యక్తి ఇద్దరు అభ్యర్థులను ప్రతిపాదించలేడు. ప్రతి అభ్యర్థికి 10 ప్రపోజర్లు అవసరం. వీరు ఎన్నికలు జరిగే నియోజకవర్గానికి చెందిన వారు అయ్యిండాలి. ఈ లెక్క ప్రకారం.. హుజూరాబాద్ లో 2200 మంది అభ్యర్థులు నిలబడితే 22000 ప్రపోజర్లను నియోజకవర్గంలో వెతకాల్సి ఉంటుంది. దీని ప్రకారం.. హుజూరాబాద్ లోని 2.26 లక్షల మంది ఓటర్లలో 22000 మంది ప్రపోజర్లను అభ్యర్థులు వెతుక్కోవాలి. వారి మద్దతుతో నామినేషన్లు వేయాలి. ఇది హుజూరాబాద్ లో ప్రత్యేక పరిస్థితిని సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వాస్తవానికి 2200 మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నికల సంగం ఈవీఎంకు బదులుగా బ్యాలెట్ పత్రాలను ఎంచుకోవాల్సి ఉంటుందని వర్గాలు చెబుతున్నాయి. గందరగోళ ఎన్నికల చిహ్నాలతో అభ్యర్థులకు ఓటు వేసే ఓటర్లు.. ముఖ్యంగా గ్రామీణ నిరక్ష్యరాస్యులు పూర్తిగా గందరగోళానికి గురవుతారని చెబుతున్నారు. ఇంత మందిపోటీపడితే చాలా చెల్లని ఓట్లు దాఖలు అవుతాయని ఎన్నికల విశ్లేషకులు భయపడుతున్నారు.

ఈ విధమైన సామూహిక నామినేషన్లు అనేక సమస్యలను కలిగిస్తాయని వారు భావిస్తున్నారు. ఈటల రాజేందర్ శిబిరం ఓటర్లను గందరగోళానికి గురిచేయడానికి, టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను విభజించడానికి ఈ సామూహిక నామినేషన్లు వేయించాలని అధికార టీఆర్ఎస్ వ్యూహంగా ఇది కనిపిస్తోందంటున్నారు.

మరి ఇది ఎన్నికల తుది ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది వేచిచూడాలి. ఈ పరిణామం మాత్రం ఈటల వర్గాన్ని తీవ్రంగా భయపెడుతోందంటున్నారు.
Tags:    

Similar News