వ్యాక్సిన్ పాస్ పోర్టు.. స్వేచ్ఛ‌గా ఎగిరిపోవ‌చ్చు!

Update: 2021-05-24 01:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ కొన‌సాగుతోంది. థ‌ర్డ్ వేవ్ కూడా రాబోతోంద‌ని అంటున్నారు. ఆ త‌ర్వాత ఇంకెన్ని వేవ్ లు వ‌స్తాయో ఇప్ప‌టికైతే ఎవ్వ‌రికీ తెలియ‌దు. మ‌రి, ఇలాంటి ప‌రిస్థితుల్లో.. విమాన ప్ర‌యాణాల‌ను ఎన్ని రోజుల‌ను నిలిపేస్తారు? నిరవధిక ర‌ద్దు వల్ల అన్ని దేశాల్లో ఆదాయం ప‌డిపోతోంది. ఈ ప‌రిస్థితి మ‌రింత కాలం కొన‌సాగితే ఇబ్బందులు మ‌రింత ఎక్కువ అవుతాయి. ఈ నేప‌థ్యంలో విమాన ప్ర‌యాణాల‌ను కొన‌సాగించేందుకు క‌నిపిస్తున్న ఏకైక మార్గం ‘వ్యాక్సిన్ పాస్ పోర్టు’.

కొవిడ్ కు పూర్తిగా క్యూర్ లేని ఈ ప‌రిస్థితుల్లో.. దాని నివార‌ణ‌కు ఉన్న ఏకైక మందు వ్యాక్సినే. దీంతో.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి విమాన ప్ర‌యాణం చేసే అవ‌కాశం క‌ల్పించేందుకు అడుగులు వేస్తున్నాయి ఆయా దేశాలు. ఇప్పుడైతే.. విమాన ప్ర‌యాణం చేసేవారిలో ఎవ‌రికి కొవిడ్ ఉందో చెప్ప‌లేని ప‌రిస్థితి. కానీ.. వ్యాక్సిన్ పాస్‌పోర్టు అమ‌ల్లోకి వ‌స్తే మాత్రం ఈజీగా తెలిసిపోతుంది.

స‌ద‌రు ప్ర‌యాణికుడు క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నాడా? లేదా? అనేది అత‌డి పాస్ పోర్టే నిర్ధారిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న‌ట్టుగా పాస్ పోర్టుకు అనుసంధానంగా ఒక ధ్రువీక‌ర‌ణ‌ ప‌త్రం ఇస్తారు. దీన్ని డిజిట‌లైజ్డ్ డాక్యుమెంట్ గా రూపొందించాల‌ని యోచిస్తున్నారు. అంటే.. ఇప్పుడున్న పాస్ పోర్టుకు అద‌నంగా డిజిట‌ల్ డాక్యుమెంటును ఇస్తారు. ఇది తీసుకొని విమానం ఎక్కి స్వేచ్ఛ‌గా విదేశాల‌కు వెళ్లిపోవ‌చ్చ‌న్న‌మాట‌. ఆ దేశంలో ఈ వ్యాక్సిన్ పాస్ పోర్టును చూపిస్తే.. ఎలాంటి ఆంక్ష‌లూ లేకుండానే విహ‌రించొచ్చు.

ఈ విధానాన్ని మొద‌టి సారిగా బ్రెజిల్ త‌మ‌దేశ ప్ర‌యాణికుల‌కోసం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌ద్ధ‌తి బాగుండ‌డంతో.. అంద‌రూ ఇదే విధానాన్ని అనుస‌రించ‌డానికి చూస్తున్నారు. ఇప్ప‌టికే హంగేరీ, డెన్మార్క్ గ్రీస్ వంటి దేశాలు కూడా వ్యాక్సిన్ పాస్ పోర్టు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. మ‌న దేశంతోపాటుప‌లు దేశాల్లో ఆలోచ‌న‌లు చేస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో ఇది అనివార్యంగా మారింది. అయితే.. ఇది ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌న్న‌ది చూడాలి.




Tags:    

Similar News