గత రికార్డులను తిరగరాసిన తిరుమల ఆలయం!

Update: 2023-01-04 10:34 GMT
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల బాలాజీ దేవస్థానం హుండీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ హుండీ వసూళ్లు రూ.7.68 కోట్లుగా నమోదయ్యాయి. ఇది ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధికం.

కాగా పవిత్ర ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి విపరీతమైన రద్దీ ఏర్పడింది. అదేవిధంగా, హుండీ ఆదాయం కూడా కొత్త శిఖరాన్ని తాకాయి. గత ఏడాది అక్టోబర్‌ 23న నమోదైన రూ.6.31 కోట్ల అత్యధిక హుండీ కలెక్షన్లే ఇప్పటివరకు ఒక్కరోజు వచ్చిన ఆదాయంలో రికార్డుగా ఉంది.

గత రికార్డును ఈ ముక్కోటి ఏకాదశి అధిగమించింది. జనవరి 2వ తేదీన శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకలు రూ.7.68 కోట్లు. కోవిడ్‌ తర్వాత గత కొన్నేళ్లుగా టీటీడీ భారీగా వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హుండీ కలెక్షన్లు కూడా భారీగానే ఉన్నాయి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2న స్వామివారిని 69,414 మంది దర్శించుకోగా.. 18,612మంది తలనీలాలు సమర్పించారు. మొత్తం మీద 2022లో తిరుమల హుండీలు గలగలలాడాయి. శ్రీవారికి భక్తులు రూ.1446 కోట్లు సమర్పించారు. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 11,42,78,291 కోట్ల ఆదాయం వచ్చింది.

కాగా.. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 11 వరకు కొనసాగనుంది. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సామాన్య భక్తులకు టీటీడీ పెద్ద పీట వేసింది. ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించినట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజులు సిఫారసు లేఖల దర్శనాలు రద్దు చేశారు. భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ చేశారు. దీంతో దర్శనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News