వంగ‌వీటి రాధా రాజ‌కీయం ముగిసిందా?

Update: 2019-07-21 13:10 GMT
అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శ‌ని ఉంద‌న్న‌ట్టుగా.. మారిపోయింది విజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన నాయ‌కుడు - యువ నేత వంగ‌వీటి రాధా కృష్ణ రాజ‌కీయ ప‌రిస్తితి. త‌న వ్య‌వ‌హార‌శైలితో ఉన్న‌దానిని కూల్చుకుంటూ... కొత్త వాటి కోసం ఆయ‌న పెడుతున్న ప‌రుగులో ఆయాసం మిగులుతోంది త‌ప్పితే.. అవ‌స‌రం మాత్రం తీర‌డం లేదు. త‌న తండ్రి - కాపు నాయ‌కుడు వంగ‌వీటి రంగా చ‌రిష్మాను అడ్డుపెట్టుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాధా.. కాంగ్రెస్ హ‌యాంలో 2004లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత నుంచి ఆయ‌న వేసిన అడుగులు ఒక్కొక్క‌టిగా ఈ కుటుంబాన్ని రాజ‌కీయంగా స్థిర‌త్వం లేకుండా చేస్తున్నాయి.

ఆయ‌న వేసిన ప్ర‌తి అడుగు త‌ప్ప‌ట‌డుగై.. రాజ‌కీయ భ‌విష్య‌త్తునే నాశ‌నం చేస్తోంది. ప‌చ్చ‌గా ఉన్న పార్టీలో నుంచి కేవ‌లం దుందుడుకు వ్యూహంతో బ‌య‌ట‌కువ‌చ్చిన రాధా.. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త‌న సామాజిక వ‌ర్గం త‌న‌ను కాపాడుతుంద‌ని - చిరంజీవి చ‌రిష్మా త‌న‌ను గెలిపిస్తుంద‌ని - అధికారంలోకి అన్న‌య్యే వ‌చ్చేస్తాడ‌ని భావించి.. వైఎస్ ఎంత చెప్పినా విన‌కుండా పార్టీ నుంచి బయ‌ట‌కు వ‌చ్చారు. త‌ర్వాత ఓట‌మి పాల‌య్యారు. ఇక‌, ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్‌ లో విలీనం చేసిన‌ప్పుడు.. మౌనంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌ర్వాత చాలా ఏళ్ల‌కు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వైసీపీ టికెట్‌ పై 2014లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక‌, ఆత‌ర్వాత కూడా అదే పార్టీలో కొన‌సాగినా.. ఆర్థికంగా ఇబ్బందులు ప‌డ్డారు. రాజ‌కీయంగా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇక‌, తాజా ఎన్నిక‌ల వేళకి.. చెప్పుడు మాట‌లు విని.. మ‌రోసారి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును కాల‌ద‌న్నుకున్నారు. నేరుగా వైసీపీ నుంచి వెళ్లి.. త‌న తండ్రి తీవ్రంగా వ్య‌తిరేకించిన టీడీపీ లోకి జంప్ చేశారు. మ‌రోసారి టీడీపీ అదికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని - త‌న‌కు రాజ‌కీయంగా ఉజ్వ‌ల భ‌విత‌వ్యం ఉంటుంద‌ని పేక మేడ‌లు క‌ట్టుకున్నారు. అయితే, రాష్ట్రంలో అధికారం మారిపోయింది. టీడీపీ ప‌త‌నావ‌స్థ‌కు చేరుకుంది.

దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క రాధా ల‌బోదిబోమంటున్నాడు. నిజానికి వైసీపీలో రాధాకు జ‌గ‌న్ మంచి ప్రాధాన్యం ఇచ్చారు. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌ట్టుప‌ట్ట‌కుండా ఏది కోరుకున్నా ఇస్తాన‌ని చెప్పారు. ఎంపీ - ఎమ్మెల్యేగా ఏ టికెట్ అడిగినా ఇస్తాన‌ని వ‌ర్త‌మానం పంపారు. దీనికి స‌సేమిరా అన్న వంగ‌వీటి త‌న‌కు సెంట్ర‌ల్ ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టి యుద్ధం చేసి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ ఓట‌మికి కృషి చేశారు. దీంతో ఇప్పుడు అటు టీడీపీకి ద‌గ్గ‌ర కాలేక‌, ఇటు వైసీపీకి దూర‌మై ఆయ‌న సాధించింది శూన్యం. ఇక‌, ఇప్పుడు ఆయ‌న ముందు మిగిలింది కేవలం బీజేపీ. ఆ పార్టీ నాయ‌కులు ఇప్ప‌టికే రెండు సార్లు రాధాకు క‌బురు పంపార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కాపులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటే తాను దానినే అనుస‌రిస్తాన‌ని ఆయ‌న చెప్పార‌ని స‌మాచారం. ఏదేమైనా..రాధా రాజ‌కీయ భ‌విత‌వ్యం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.


Tags:    

Similar News