వర్ల ప్రయత్నాలు ఫలిస్తాయా?

Update: 2021-11-26 06:31 GMT
తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎదుటివారి నుండి తాము అనుకున్నట్లుగా స్పందన లేదని అనుకుంటే భలే విచిత్రంగా వ్యవహరిస్తారు. తాజాగా పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య కామెంట్లే దీనికి నిదర్శనం.

భువనేశ్వరిని మంత్రి కొడాలి నాని, టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ విమర్శలు చేయటానికి నిరసనగా దీక్ష చేసినట్లు తెలిపారు. నిజానికి భువనేశ్వరిపై ఆరోపణలు చేసింది వంశీయే కానీ కొడాలి కాదు. అంటే టీడీపీ వాళ్ళకు ఇష్టం లేని నేతలందరిపైనా ఏదో విధంగా బురదచల్లేయటం అలవాటే.

దీక్ష సందర్భంగా మాట్లాడిన ఈ అధికార ప్రతినిధి కొడాలి నాని, వంశీ, జూనియర్ ఎన్టీయార్, పేర్నినానిలపై రెచ్చిపోయారు. భువనేశ్వరిని వంశీ డ్యామేజింగ్ మాట్లాడితే వర్ల మాత్రం కొడాలిని కూడా కలిపేశారు. అలాగే జూనియర్ ఎన్టీయార్ వీడియో సందేశాన్ని కూడా అవహేళన చేశారు. పైగా మేనత్త భువనేశ్వరిని అవమానించిన కొడాలి, వంశీ విషయంలో జూనియర్ ఎన్టీయార్ విఫలమయ్యారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇదే జూనియర్ ఎన్టీయార్ ను ఒకపుడు తోడల్లుళ్ళు నారా లోకేష్+భరత్ తీసి పడేసినట్లుగా మాట్లాడారు. మరప్పట్లో వర్లకు భువనేశ్వరికి జూనియర్ మేనల్లుడని గుర్తుకురాలేదా ? ఇపుడు దీక్షలో జూనియర్ ను తప్పుపడుతున్న వర్ల మరప్పుడు ఎందుకని స్పందిచలేదు ? బూతుల మంత్రి పేర్ని నానికి జూనియర్ ఎన్టీయార్ అంటే భయమట.

పేర్నిపైన బూతుల మంత్రనే ముద్రను వర్లే కొత్తగా వేశారు. అసలు జూనియర్ ఎన్టీయార్ అంటే పేర్ని ఎందుకు భయపడాలో వర్లే చెబితే బాగుంటుంది.

హోలు మొత్తం మీద చూస్తే అర్ధమవుతున్నదేమంటే కొడాలి, పేర్ని, వంశీలకు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీయార్ ను వర్ల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని. రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకులు ఎవరు లేరని వర్ల తెలుసుకోలేకపోవటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో తనకన్నా మిగిలిన వాళ్ళు చాలా సీనియర్లన్న విషయాన్ని వర్ల మరచిపోయినట్లున్నారు.

తాను రెచ్చగొడితే కొడాలి, పేర్ని, వంశీలపై జూనియర్ ఎన్టీయార్ రెచ్చిపోతారని అనుకోవటమే వర్ల అమాయకత్వం. భువనేశ్వరి విషయంలో స్పందించాల్సిన బాధ్యత జూనియర్ ఎన్టీయార్ కన్నా ముందు భర్తగా చంద్రబాబునాయుడుకి కొడుకుగా నారా లోకేష్ కు ఉందన్న విషయం వర్ల మరచిపోయినట్లున్నారు.

వంశీపై చర్యలు తీసుకోవటంలో ఇప్పటికీ టీడీపీ భయపడుతోంది. ఏదేమైనా దీక్ష పేరుతో జూనియర్ ను అనాల్సిందంతా అనేసి తన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలన్నీ తన వ్యక్తిగతమని చెప్పటమే కొసమెరుపు.


Tags:    

Similar News