సెక్ర‌టేరియ‌ట్‌ కు గ్రామ పంచాయ‌తీ నోటీసులు!

Update: 2018-11-27 10:46 GMT
రాష్ట్రంలో అత్యున్న‌త ప‌రిపాల‌నా భ‌వ‌నం సెక్ర‌టేరియ‌ట్. ఆయా శాఖ‌ల అత్యున్న‌త అధికారాలు మొద‌లుకొని మంత్రులు, ముఖ్య‌మంత్రి కూడా అక్కడి నుంచే పాల‌నా వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు. అలాంటి సెక్ర‌టేరియ‌ట్‌ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఓ గ్రామ పంచాయ‌తీ షాక్ ఇస్తోంది! త‌మ‌కు ప‌న్ను క‌ట్టాలంటూ నోటీసులిస్తోంది! ఈ వ్య‌వ‌హారం చూసి ఇప్పుడు అంతా ఔరా అంటూ నోర్లు వెళ్ల‌బెడుతున్నారు.

అస‌లు విష‌యం ఏంటంటే.. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిపాల‌నా బాధ్య‌త‌లు ప‌ర్య‌వేక్షించేందుకుగాను నూతన రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో ప్ర‌భుత్వం తాత్కాలిక స‌చివాల‌యాన్ని 2016 నిర్మించింది. అది వెల‌గ‌పూడి గ్రామ పంచాయితీ ప‌రిధిలోకి వ‌స్తుంది. చ‌ట్టం ప్ర‌కారం గ్రామ ప‌రిధిలో ప్ర‌తీ ఆస్తికి ఇంటి ప‌న్ను వ‌సూలు త‌ప్ప‌నిసరి. స‌చివాల‌యం కూడా అందుకు మిన‌హాయింపేమీ కాద‌ని పంచాయ‌తీ అధికారులు భావించారు. అందుకే ప‌న్ను చెల్లింపుపై గ్రామ స‌చివాల‌య అధికారులు - జిల్లా పంచాయ‌తీరాజ్ ఉన్న‌తాధికారులు ప‌లుమార్లు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌తో మంత‌నాలు జ‌రిపారు. ప‌న్ను క‌ట్టాల‌ని సూచించారు.

సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ నుంచి పంచాయ‌తీ అధికారుల‌కు ఎలాంటి స్పంద‌న రాలేదు. దీంతో ముక్కు పిండి మ‌రీ ప‌న్ను వ‌సూలు చేసేందుకు వారు సిద్ధ‌మ‌వుతున్నారు. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా సెక్ర‌టేరియ‌ట్‌ కు నోటీసులు జారీ చేయాల‌ని గుంటూరు పంచాయ‌తీ అధికారి ఇటీవ‌ల వెల‌గ పూడి గ్రామ కార్య‌ద‌ర్శికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పంచాయితీ రాజ్ చ‌ట్టం ప్రకారం.. ప్రస్తుతం వెల‌గ‌పూడిలో అమ‌ల్లో ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తీ వంద రూపాయాల ఆస్తికి 60 పైస‌ల చొప్పున ఆస్తి ప‌న్ను వ‌సూలు చేస్తున్నారు. దీంతో సెక్ర‌టేరియ‌ట్ చెల్లించాల్సిన ప‌న్నును లెక్కించేందుకుగాను భ‌వ‌న విస్తీర్ణం త‌దిత‌ర వివ‌రాలు ఇవ్వాల్సిందిగా సెక్ర‌టేరియ‌ట్ అధికారుల‌కు గ్రామ పంచాయ‌తీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు సెక్ర‌టేరియ‌ట్ అధికార‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. ఓ గ్రామ పంచాయ‌తీ ఏకంగా సెక్ర‌టేరియ‌ట్‌కు నోటీసులు ఇవ్వ‌డ‌మేంట‌ని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు మాత్రం పంచాయ‌తీ వ్య‌వ‌స్థ ప‌వ‌ర్‌ను వెల‌గ‌పూడి గ్రామ పంచాయ‌తీ చూపిస్తోందంటూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు.


Tags:    

Similar News