కొత్త డ్యూటీలో వెంక‌య్య అద‌ర‌గొట్టేస్తున్నాడే

Update: 2016-07-11 14:14 GMT
కేంద్ర స‌మాచార - ప్ర‌సార శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ మేర‌కు కొత్త బాధ్య‌త‌ల్లోకి వెంట‌నే దూకేశారు. ఉగ్రవాది బుర్హాన్ వానీ మ‌ర‌ణం అనంత‌రం నెల‌కొన్న ప‌రిస్థితులపై ఆయ‌న మండిప‌డ్డారు. కశ్మీర్‌ లో ఉగ్రవాదిని హతమార్చినందుకు కొన్ని అసాంఘీక శక్తులు హింసను ప్రేరేపిస్తున్నాయని వెంక‌య్య‌ విమర్శించారు. కేంద్రప్రభుత్వం - కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం క‌లిసి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు.

దేశ భద్రత విషయంలో రాజీపడవద్దని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ - గులాంనబీ ఆజాద్ - సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు స్వాగ‌తించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్దితుల్లో సహించేది లేదని, శ్రీనగర్ లో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలపై ఉన్నత స్దాయి సమావేశం నిర్వహించామ‌ని, దేశంలో ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామ‌ని వెంక‌య్య‌నాయుడు స్ప‌ష్టం చేశారు.  దేశ సమగ్రత& భద్రత కోసం ఎంతో మంది సైనికులు ప్రాణ త్యాగం చేస్తున్నారని, ఉగ్రవాది బుర్హాన్ వానీకి మద్దతుగా నిలిచేవారు దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికుల గురించి ఆలోచించాలని సూచించారు. జకీర్ నాయక్ పీస్ ఛానల్ లో పీస్ లేదని, అందుకే పీస్ ఛానల్ ను కొన్ని దేశాలు నిషేధించాయని వెంక‌య్య‌నాయుడు ఎద్దేవా చేశారు. జకీర్ నాయక్ మత భోదలపై కేంద్ర హోంశాఖ అధ్యయనం చేస్తుందని తెలిపారు. జకీర్ నాయక్ మత భోదలలో అభ్యంతర కర అంశాలుంటే చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. అనుమతులు లేని ఛానల్స్‌ దేశ సమగ్రతకు రక్షణకు ముప్పుతెచ్చే కార్యక్రమాలు ప్రదర్శిస్తే సమాచార ప్రసార శాఖ దృష్టికి తీసుకురావాలని ప్రజలను వెంకయ్యనాయుడు కోరారు. అనుమతులు లేకుండా ప్రసారమవుతున్న ఛానల్స్ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించామ‌ని తెలిపారు.

అమర్ నాథ్‌ యాత్రకు వెళ్ళిన తెలుగు యాత్రికులు అక్క‌డే చిక్కుకున్న అంశంపై జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తొ మాట్లాడాన‌ని వెంక‌య్య‌నాయుడు వెల్లడించారు. యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. ప్ర‌స్తుతం అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారని ఆయ‌న‌ చెప్పారు.
Tags:    

Similar News