స్మార్ట్‌ పాపం:ఇంట గెలవలేకపోతున్న వెంకయ్య

Update: 2015-09-07 04:41 GMT
వెంకయ్యనాయుడు ఎంత గొప్ప ఎడ్మినిస్ట్రేటర్‌ అయినా కావొచ్చు. పట్టణాభివృద్ధి శాఖను ఆయన ఎంత గొప్పగా అయినా నడిపిస్తూండవచ్చు. కానీ.. ఆయన ఇంట గెలిచి- రచ్చ గెలవడం రీతి అనే ప్రాథమిక సూక్తిని మరచిపోయినట్లుగా కనిపిస్తోంది. తెలుగునాట రెండు రాష్ట్రాలను కలిపి లెక్కవేసినా కూడా.. వెంకయ్యనాయుడును అభినందించే సామాన్యుడు ఒక్కడు కనిపించడం లేదు. ఆయన సొంత ప్రాంతమైన తెలుగురాష్ట్రాలకు చేసిందేమీ లేదనే అంతా అంటున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్‌లో అయితే అచ్చంగా వెంకయ్య ద్రోహం చేశాడనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది కూడా! మరి ఇంట పరువు పోగొట్టుకుంటూ.. బయట కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నంత మాత్రాన వెంకయ్యకు లాభమేంటి?

చాలా మందిలో ఈ అనుమానం కలుగుతోంది. తాజాగా హర్యానాలో మెట్రో రైలును ప్రారంభించిన సందర్భంలోనూ ప్రధాని నరేంద్రమోడీ.. పట్టణాభివృద్ధి శాఖగా వెంకయ్యనాయుడు సామర్థ్యాన్ని బహుధా కొనియాడారు. వెంకయ్య చాలా బాగా తన శాఖను నిర్వహిస్తున్నారని చెప్పారు. పట్టణ పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం, స్మార్ట్‌ నగరాల ఎంపిక విషయంలో వెంకయ్య కృషి మరువలేనిదని మోడీ పొగిడారు. ప్రధాని పొగడ్తలను ఒక తెలుగు నేత హర్యానా లో దక్కించుకోవడం మనకు గర్వకారణమే. కానీ, ఆయన వల్ల మన తెలుగుప్రాంతానికి ఒరుగుతున్నదేమిటి? వెంకయ్య వల్ల పట్టణాల్లో ఆర్థిక ప్రగతి మెరుగుపడుతుందని ప్రధాని కితాబిచ్చారు..బాగానే ఉంది.. కానీ.. ఆ ప్రగతి.. వారు ఎంపిక చేసిన... స్మార్ట్‌ నగరాల్లో ఉంటుందే తప్ప.. వెంకయ్య టేలెంటు ఆయన స్వస్థలం అయిన తెలుగు ప్రాంతానికి ఏమాత్రమైనా అదనంగా ఉపయోగపడడం లేదన్నదే ప్రజల ఆవేదన.

అయితే ఈ పరిణామాల్ని కొందరు విశ్లేషిస్తున్న తీరు వేరుగా ఉంది. వెంకయ్య నాయుడు ప్రజల మధ్య ఎన్నికల్లో బరిలోకి దిగి పోటీచేసి నెగ్గే అలవాటు ఎప్పుడో కోల్పోయారు. ఆయనకు ప్రజల ఓట్లతో పనిలేదు గనుక.. ఆయన ప్రజలను పట్టించుకోరు. ఆయనకు దక్కగల పదవులు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే దక్కుతాయి గనుక.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే పనిచేస్తారని అంటున్నారు. అందుకే ఆయన ఏపీ, తెలంగాణలకు స్మార్ట్‌ సిటీల్లో మొండిచేయి చూపించి.. అటు పొరుగున ఉన్న తమిళనాడులో చిన్న చిన్న పట్టణాలను కూడా స్మార్ట్‌ పేరిట అక్కడకు నిధుల వరద పారిస్తున్నారని.. తమిళనాడులో 12 స్మార్ట్‌ నగరాల ఎంపిక కేవలం పార్టీకి లబ్ది చేకూర్చడానికి మాత్రమేఅని విశ్లేషిస్తున్నారు. ప్రజల ఓట్లతో ఆయనకు పనిలేదని తేలిపోయాక ఇక పార్టీ సేవ, అధినేతల భజన తప్ప ఆయనకు మరొక ఎజెండా ఎందుకుంటుంది అని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News