అమ్మ అంటే ఎవ‌ర‌ని త‌ల్లినే అడిగే రోజొస్తుంది

Update: 2017-09-18 06:10 GMT
భార‌త ఉప‌రాష్ట్ర‌పతిగా వెంక‌య్య‌నాయుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను మ‌ళ్లీ చాటుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆయ‌న త‌న‌దైన శైలిలో మ‌ళ్లీ పొగిడేశారు. అంతేకాదు, వెంక‌య్య త‌న మాతృభాష తెలుగు గురించి మ‌రింత ఆస‌క్తికరంగా మాట్లాడి అంద‌రినీ ఆనందంలో ముంచెత్తారు.  నిజానికి గ‌తంలో మంత్రిగా ఉన్న‌ప్పుడు కానీ, ప్ర‌స్తుతం ఉప రాష్ట్ర‌ప‌తి అయ్యాక కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నా.. వెంక‌య్య‌నాయుడు త‌న‌దైన శైలిలో ప్ర‌సంగించ‌డం అంద‌రికీ తెలిసిందే. ప్రాస‌లు లేందే ఆయ‌న మాట్లాడ‌రు. సామెత‌లు, నుడికారాల‌ను జోడించ‌కుండా ఆయ‌న ఎక్క‌డా ప్ర‌సంగించరు. అంతేకాదు, తెలుగు భాషంటే ఆయ‌న చెవి కోసుకుంటారు కూడా.

అలాగే తాజాగా ఆదివారం హైద‌రాబాద్‌ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వెంక‌య్య‌.. త‌న‌దైన శైలిలో ప్ర‌సంగించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. అయితే ఆయ‌న గ‌తానికి భిన్నంగా తెలుగు గురించి మాట్లాడ‌డం ఇప్పుడు విశేషం. ఏపీ, తెలంగాణ‌ల్లోని అన్ని పాఠ‌శాల‌ల్లోనూ తెలుగు మీడియం ప్ర‌వేశ‌పెట్టాల‌ని తాను కోరుకోవ‌డం లేద‌ని ఆయ‌న చెప్ప‌గానే అంద‌రూ ఆశ్చ‌ర్య పోయారు. అయితే అదేస‌మ‌యంలో ఆయ‌న తెలుగు భాష‌ను త‌ల్లిపాల‌తో పోల్చ‌డంతో ఒక్క‌సారిగా ప్రాంగ‌ణ‌మంతా చ‌ప్ప‌ట్ల‌తో హోరెత్తిపోయింది. ఇక‌ రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాలల్లోనూ తెలుగు భాషను తప్పనిసరి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు వెంక‌య్య అభినందనలు తెలిపారు. పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ప్రాస‌ల‌తో కేసీఆర్ కీర్తిని ఆకాశానికెత్తేశారు. అదే స‌మ‌యంలో తెలుగు గురించి కొంత ఆవేద‌న కూడా వ్య‌క్త‌ప‌రిచారు వెంక‌య్య‌.

మాతృ భాష మాధుర్యాన్నిరాబోయే రోజుల్లో మన పిల్లలు అనుభవించే పరిస్థితి లేదన్నారు. ప్ర‌స్తుతం అమ్మ‌నాన్న మాట‌లు విందామ‌న్నా విన‌బ‌డ‌డం లేద‌న్నారు. మ‌మ్మీ డాడీల సంస్కృతి పెరిగిపోయింద‌ని, ఇదే ఫ్యాష‌న్‌ గా మారిపోయింద‌ని చెప్పారు. మ‌రో 50 ఏళ్ల త‌ర్వాత అమ్మ అంటే ఎవ‌రు అని కొడుకు త‌న త‌ల్లిని ప్ర‌శ్నించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేని ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  బ్రిటీష్ వాళ్లు పోతూపోతు ఇంగ్లీష్ వస్తేనేగానీ ఉద్యోగమనే నిబంధనను పెట్టారని, ఇది మంచిది కాద‌ని అన్నారు. దేశంలో ఇప్ప‌టికీ ఎక్కువ శాతం జనాభాకు ఇంగ్లీష్ రాదని, బ్యాంకు అప్లికేషన్లు కూడా పూర్తి చేయలేయని పరిస్థితి ఉందని చెప్పారు. ఇంగ్లీష్ తప్పుకాదన్న వెంక‌య్య‌.. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌ నేర్చుకోవాలన్నారు.
Tags:    

Similar News