కేంద్రమంత్రి మనసు దోచుకున్న కేసీఆర్

Update: 2017-01-03 10:25 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లానింగే.. ప్లానింగ్ అని చెప్పాలి. వేలాది ఇళ్లు కట్టించినా రాని పేరుప్రఖ్యాతులు.. వందల ఇళ్లతోనే సంపాదించటం ఆయనకు మాత్రమే చెల్లింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన డబుల్ బెడ్రూం స్కీం విన్న వారంతా వావ్ అనటం ఖాయం. అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను చూసిన వారు ఎవరైనా సరే.. ఇట్స్ అమేజింగ్ అనకుండా ఉండలేరు.

ఎర్రవల్లిని ఒక మోడల్ గా చూపించి.. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇదే తీరులో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించాలన్నదే తెలంగాణ సర్కారు ఆలోచనని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నంగా చాటి చెప్పుకుంటున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల్ని మాటల్లో ఎంత వినసొంపుగా చెబుతారో.. అంతే చక్కగా చేతల్లో కట్టి చూపించిన వైనం చూసినప్పుడు ఎవరు మాత్రం ప్రశంసించకుండా ఉంటారు.

అలా పొగిడేసే బ్యాచ్ లో తాజాగా కేంద్రమంత్రి విజయ్ గోయల్ కూడా చేరిపోయారు. తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి మోడల్ అయిన ఎర్రవల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించిన కేంద్రమంత్రి.. తెలంగాణ సర్కారును ప్రశంసించటమే కాదు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా కేసీఆర్ కు మాత్రమే సొంతమని పొగిడేశారు.

డబుల్ బెడ్రూం ఇళ్లు చాలా చక్కగా ఉన్నాయని.. ఈ పథకం దేశానికి ఆదర్శంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పథకం గురించి ప్రధాని మోడీతో చర్చించి.. దేశ వ్యాప్తంగా అమలయ్యేలా తాను చూస్తానని చెప్పిన కేంద్రమంత్రి మాటలు చూస్తే.. తాను నిర్మించే డబుల్ బెడ్రూం ఇళ్లతో ఎలాంటి మైలేజీ కోరుకున్నారో.. దాన్ని సొంతం చేసుకున్నట్లుగా చెప్పక తప్పదు. వందల ఇళ్లనే కట్టించినా.. వేలాది ఇళ్లను నిర్మించిన వారికి సైతం రాని పేరును కేసీఆర్ సొంతం చేసుకున్నారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News