విజ‌య సాయిరెడ్డి సంచ‌ల‌నం!..అరెస్ట్ చేసుకోండి!

Update: 2019-02-25 05:47 GMT
వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌యసాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చారంటే.. అధికార టీడీపీకి ముచ్చెమ‌ట‌లు గ్యారెంటీనే. ఎందుంక‌టే... ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా - ట్విట్ట‌ర్‌ లో ప్ర‌త్య‌క్ష‌మైనా... విజ‌యసాయిరెడ్డి త‌న‌దైన శైలిలో టీడీపీపై విరుచుకుప‌డ‌టం తెలిసిందే క‌దా. చాలా లాజిక‌ల్‌ గానే కాకుండా వెరైటీ త‌న‌దైన శైలి ఆరోప‌ణ‌లు గుప్పించే విజ‌య సాయిరెడ్డి... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో పాటు ఆయ‌న కుమారుడు - మంత్రి నారా లోకేశ్ ల‌పైనా ఘాటు వ్యాఖ్య‌లు చేస్తుంటారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు మాట మార్చిన తీరును ప్ర‌శ్నిస్తూ... ఏకంగా చంద్ర‌బాబుకు యూట‌ర్న్ అంకుల్ అంటూ స‌రికొత్త పేరు పెట్టిన విజ‌యసాయిరెడ్డి... టీడీపీని ఇర‌కాటంలోకి నెట్టేశారు.

ఈ త‌ర‌హా కొత్త ఆరోప‌ణ‌ల‌తో నిత్యం ట్విట్ట‌ర్ వేదిక‌గా విరుచుకుప‌డుతున్న విజ‌యసాయిరెడ్డి... త‌న తాజా ట్వీట్ లో టీడీపీ స‌ర్కారుకు ఏకంగా ఓ స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే త‌న‌ను అరెస్ట్ చేసుకోవాల‌ని ఆయ‌న సంధించిన ఆ స‌వాల్ కు ఇప్ప‌టిదాకా టీడీపీ నుంచి అస‌లు స‌మాధాన‌మే రాలేదు. విజ‌యసాయిరెడ్డి స‌వాల్ నేప‌థ్యాన్ని ఓ సారి ప‌రిశీలిస్తే... ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ద‌ళితుల‌ను దూషించిన ఘ‌ట‌న రాష్ట్రంలో పెద్ద సంచ‌ల‌న‌మే రేపిన సంగ‌తి తెలిసిందే క‌దా. అయితే ఆ త‌ర్వాత చింత‌మనేని చేసిన స‌ద‌రు దూష‌ణ‌లు వాస్త‌వం కాద‌ని - మార్ఫింగ్ వీడియోల‌తో వైసీపీ నేత‌లు కుట్ర‌లు చేశార‌ని టీడీపీ స‌ర్కారు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసింది. వారిలో ఒక‌రి అరెస్ట్ చాలా చిత్రంగా జ‌రిగింది. పెళ్లైన మ‌రునాడే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పెద్ద చ‌ర్చ‌కే తెర తీశారు. అరెస్టైన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు కోర్టు వెంట‌నే బెయిల్ ఇచ్చేసింద‌నుకోండి.

ఈ త‌ర‌హా అరెస్ట్‌ ల‌పై విజ‌యసాయిరెడ్డి నిన్న ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. తాను కూడా చింత‌మ‌నేని ద‌ళితుల‌ను దూషిస్తున్న‌ట్లుగా ఉన్న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాన‌ని - ద‌మ్ముంటే త‌న‌ను అరెస్ట్ చేసుకోవాల‌ని ఆయ‌న చంద్రబాబు స‌ర్కారుకు స‌వాల్ విసిరారు. విజ‌యసాయిరెడ్డి ట్వీట్ ఎలా సాగిందంటే... *ట్వీట్లు  - ఫేస్ బుక్ సాకుగా అరెస్ట్ లు చేయొద్దంటూ 2015లోసుప్రీంకోర్టు తీర్పు కూడా తెలియని మీరేం ఐటీ మంత్రి లోకేషూ!ఆ రూలు వర్తింప చేస్తే మీ ట్వీట్లకు రోజుకు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి?మీ డాడీ షాడో నుంచి బైటకు రా. చింతమనేని దళితులను దూషించే వీడియో పోస్ట్ చేస్తున్నాను. చర్యలు తీసుకోండి* అంటూ ఆయ‌న చంద్ర‌బాబు స‌ర్కారుకు గ‌ట్టి స‌వాలే విసిరారు. మ‌రి చంద్ర‌బాబు అండ్ కో ఈ స‌వాల్‌ పై ఏమంటుందో చూడాలి.

Tags:    

Similar News