విశాఖే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్...?

Update: 2022-03-11 00:30 GMT
ఈ మాట అన్నది ఎవరో కాదు, వైసీపీలో కీలకమైన నాయకుడు. ఇక మూడు రాజధానుల మీద వైసీపీ నేతలు అయితే  ఈ రోజుకీ మా బాట అదే అని  అంటున్నారు. అది కూడా హై కోర్టు తుది తీర్పు వచ్చిన తరువాత కూడా పదే పదే  అంటున్నారు. వైసీపీ నేతలు, మంత్రులతో పాటు కీలక నేతల నోటి వెంట కూడా ఈ మాట గట్టిగా వినవస్తోంది.

మరి వైసీపీ స్ట్రాటజీ ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు కానీ ముఖ్యమంత్రి జగన్ కి కుడి భుజం లాంటి ఎంపీ విజయసాయిరెడ్డి సైతం అదే మాట అందుకున్నారు.  తాజాగా ఆయన వైసీపీ సోషల్ మీడియా వింగ్ తో నిర్వహించిన సమావేశంలో అనేక అంశాలను ప్రస్థావించారు. అదే విధంగా కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు.

వాటిలో అతి ముఖ్యమైనది విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నది. అయితే ఆయన ఎపుడు ఇది సాకారం అవుతుంది. మూడు రాజధానులు ఉంటాయా ఉండవా అన్న జోలికి పోలేదు. ఇది మన పార్టీ స్టాండ్ అని మాత్రమే సోషల్ మీడియా కార్యకర్తలకు చెప్పారు. అంటే వారు చేసే పోస్టింగులలో మూడు మూడ్ ఎక్కడా తగ్గకూడదు అన్నట్లుగానే దిశా నిర్దేశం చేశారు అనుకోవాలి.

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలి అన్నది వైసీపె కచ్చితమైన అభిప్రాయం అని ఆయన పార్టీ వాయిస్ ని మాత్రమే వినిపించారు. ఆ విధంగా ఆయన జాగ్రత్తగానే మాట్లాడారు అనుకోవాలి. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీకి లక్షల‌ కలలు ఉండవచ్చు. కానీ ప్రభుత్వం అందులో ఒక్క దానిని అయినా చేయాలంటే రాజ్యాంగ  సహితంగానే చేపట్టాలి. మరి మూడు అయితే  కుదరదు అని హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చేసింది.

దాంతో ప్రభుత్వం ఆల్టర్నేషన్స్ ఏమైనా ఉంటే ఆలోచించుకోవచ్చు. అయితే విశాఖలో నివాసం ఉంటూ ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి అనుబంధ సంఘాలకు కూడా ఇంచార్జిగా ఉన్నారు. ఆయన సోషల్ మీడియా క్యాడర్ పార్టీ వాయిస్ ఏంటో చెప్పాలి కాబట్టి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారని అంటున్నారు.

అంతే కాదు, విశాఖలో వివిధ సామాజికవర్గాల పేరిట ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల కోసం అయిదేసి వందల గజాల  స్థలాలను ఇస్తామని చెప్పారు. విశాఖను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సోషల్ మీడియా క్యాడర్ కి పార్టీ పరంగా పదవులు ఇస్తామని అన్నారు. గ్రామ, వార్డు, మండల, జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా పదవులు పార్టీ పరంగా వారికి కేటాయిస్తామని, నామినేటెడ్ లో కూడా ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.

పార్టీ సమావేశాల్లో కూడా వారు ప్రత్యేక అహ్వానితులు అని విజయసాయిరెడ్డి చెప్పారు. విపక్షాలను విమర్శించే ముందు వ్యక్తిగతానికి పోవద్దని విజయసాయిరెడ్డి సూచించడమే  విశేషం. మీరు సెటైరికల్ గా కామెంట్స్ పెట్టండి, అంతే కానీ కాంట్రవర్సీల జోలికి పోవద్దు అని సూచించారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి సోషల్  మీడియా కీలక పాత్ర పోషించాలి అని విజయసాయిరెడ్డి కోరడం గమనార్హం.
Tags:    

Similar News