విజ‌య సాయి వ‌ర్సెస్ బండ్ల గ‌ణేష్ ట్విట‌ర్ వార్‌.. అస‌లు సంగ‌తి అది!

Update: 2022-04-18 11:30 GMT
అప్పుడెప్పుడో ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్లో చేరి.. ఈ సారి మా పార్టీ అధికారంలోకి రాక‌పోతే సెవెనో క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకుంటా అని న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ వార్తల్లో నిలిచారు. ఆ త‌ర్వాత పార్టీ ఓడిపోవ‌డంతో కామెడీ చేశా అని త‌ప్పించుకుని.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌క్తుడిగా సినిమాలు చేసుకుంటూ.. నిర్మాత అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయ‌న‌ను న‌మ్మి ఎవ‌రూ పెట్టుబ‌డి పెట్ట‌డం లేదు. చెక్ బౌన్స్ కేసులు ఎక్కువ‌య్యాయి. ఓ వైసీపీ మంత్రికి ఆయ‌న బినామీగా ఉన్నార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న‌కు పెద్ద‌గా ప‌ని లేదు.

ఇక మ‌రోవైపు రాజ్య స‌భ ఎంపీ విజ‌య సాయిరెడ్డికి ఏపీ వైసీపీలో ప‌వ‌ర్ త‌గ్గింద‌ని టాక్‌. ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌క‌టించిన కొత్త మంత్రివ‌ర్గంలో త‌న మ‌నుషుల‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. ఇక భారీ స్థాయిలో నిర్వ‌హించాల‌నుకున్న జాబ్ మేళా కూడా తుస్సుమంద‌ని అంటున్నారు. ఇటు పార్టీలో.. అటు ప్ర‌భుత్వంలో విజ‌య సాయి రెడ్డి పాత్ర పెద్ద‌గా లేకుండా జ‌గ‌న్ చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆయ‌న కూడా ఖాళీగానే ఉన్నారు.

ఇప్పుడు అర్జెంటుగా బండ్ల గ‌ణేశ్‌కు విజ‌య సాయిరెడ్డికి ప‌బ్లిసిటీ కావాల‌ని.. అందుకే స‌డ‌న్‌గా ట్విట‌ర్ వార్‌కు దిగార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు వీళ్లిద్ద‌రూ ట్విట‌ర్‌లో తీవ్రంగా విమర్శ‌లు చేసుకుంటున్నారు. నీచ‌మైన మాట‌ల‌తో స్థాయిని త‌గ్గించుకుంటున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సాయిరెడ్డి చేసిన కామెంట్స్ కు బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఇప్పుడీ ఇద్ద‌రి మ‌ధ్య ట్వీట్ వార్ తార‌స్థాయికి చేరింది. మోసాలు, అవినీతి, జైళ్లు, సీబీఐ ఎంక్వైరీలు అంటూ ఇద్ద‌రూ త‌గ్గ‌డం లేదు. మ‌ధ్య‌లో ఈ గొడవలోకి ఎన్టీఆర్, రామ్ చరణ్, పూరీ జగన్నాథ్ పేర్లను ప్రస్తావించిన విజ‌య సాయి వాళ్ల‌ను బండ్ల మోస‌గించార‌ని ఆరోపించారు. ద‌మ్ముంటే వాళ్ల‌తో స్టేట్మెంట్ ఇప్పించాలి దొంగ సాయి అంటూ బండ్ల కౌంట‌ర్ వేశారు.

వెన్నుపోటు పేటెంట్ య‌జ‌మాని చంద్ర‌బాబు బండ్ల వెన‌కాల ఉన్నార‌ని, ప్ర‌తి కుక్కా సింహం కాలేద‌ని, బండ్ల భౌభౌ మంటూ మెరిగి గ‌ర్జించా అనుకుని మురిసిపోతుంటార‌ని విజ‌య సాయి పేర్కొన్నారు. బండ్ల ఎన్నిసార్లు త‌న్నులు తిన్న‌ది, ఎవ‌రెవ‌రి కాళ్లు ప‌ట్టుకుంద‌ని త‌న‌కు తెలుసని ఆయ‌న ట్వీట్ చేశారు. దొంగ సాయి మోసం చేశార‌ని దేశం కోడై కుస్తుంద‌ని, ఆయ‌న్ని బొక్క‌లో వేసి జైల్లో పెట్టార‌ని బండ్ల కౌంట‌ర్ ఇచ్చారు.

తాను చంద్రబాబు మ‌నిషిని కాద‌ని, త‌న‌కు ప‌వ‌న్ జీవితం ఇచ్చార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాను దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ అభిమానిన‌ని, కావాలంటే కేవీపీని అడిగి తెలుసుకోమ్మ‌ని బండ్ల అన్నారు. ఇలా మీడియా ప‌బ్లిసిటీ కోసం వీళ్లు ట్వీట్‌వార్‌కు దిగార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
Tags:    

Similar News