పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి లైన్ క్లియర్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.

Update: 2025-01-17 12:40 GMT

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. 1.5 మీట్ల మందంతో వాల్ నిర్మించేందుకు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపింది. రాష్ట్ర జలవనరులశాఖ, ప్రధాన కాంట్రాక్టర్ మేఘా, సబ్ కాంట్రాక్టు సంస్థ బావర్ రూపొందించిన డిజైనుకే సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనుల్లో ఏమైనా సమస్యలు వస్తే వాటికి రాష్ర్ట జలవనరుల శాఖతో పాటు కాంట్రాక్టు సంస్థలు బాధ్యత వహించాలని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది.

డయాఫ్రం వాల్ నిర్మాణానికి సీడబ్ల్యూసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్టు పనులకు ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లైంది. సెంట్రల్ సాయిల్ - మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ ప్రతిపాదించిన టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్నే ఉపయోగించాలని సీడబ్ల్యూసీ సూచించింది. దీంతో ఈ నెల 18 నుంచి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డయాఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్, యంత్రాలు, నిపుణులను కాంట్రాక్టు సంస్థ బావర్ సమకూర్చుకుంది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధమని సంస్థ ప్రతినిధులు అధికారులకు తెలిపారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపి ఆయన ఆమోదంతో పనులు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు భావిస్తున్నారు. అయితే 18న మంచి ముహూర్తం ఉండటంతో తొలుత కొబ్బరికాయ కొట్టి, సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టు సంస్థ భావిస్తోంది.

2016లో డయాఫ్రం వాలును బావర్ సంస్థే నిర్మించింది. అప్పట్లో వాడిన మిశ్రమాన్నే ఇప్పుడూ వాడాలని నిర్ణయిస్తూ సీడబ్ల్యూసీ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి డయాఫ్రం వాల్ నిర్మాణంలో విదేశీ నిపుణుల సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అమెరికా, కెనడా నుంచి నిపుణులను రప్పించి వారి సలహాలు తీసుకుంది. అయితే డయాఫ్రం వాల్ నిర్మాణంలో వారికి అనుభవం లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం తొలి నుంచి చెబుతున్నాయి.

అయితే విదేశీ నిపుణులు సూచించిన టీ-16 మిశ్రమాన్ని కాదని, బావర్ ప్రతిపాదించిన టీ-5 కాంక్రీట్ మిశ్రమాన్నే వాడాలని జల సంఘం నిర్ణయించింది. కాగా, పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు విదేశీ నిపుణుల సలహాలన్నీ వృథాగా మిగిలిపోయాయని అంటున్నారు. పోలవరం పనులు ఈ నెలలో ప్రారంభమైతే ఏడాది చివరికల్లా డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని బావర్ సంస్థ చెబుతోంది.

Tags:    

Similar News