విశాఖ ఉక్కుకు సంక్రాంతి పండుగ తెచ్చిన మోడీ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవుతుందని అంతా అనుకున్నారు. నాలుగేళ్ళుగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అంతా ఉద్యమిస్తున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవుతుందని అంతా అనుకున్నారు. నాలుగేళ్ళుగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అంతా ఉద్యమిస్తున్నారు. విశాఖ ఉక్కు ఏమైపోతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యాపిస్తున్న వేళ కేంద్రం భారీ ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించింది.
దీంతో విశాఖ ఉక్కు కర్మాగారానికి అతి పెద్ద సంక్రాంతి పండుగ వచ్చినట్లు అయింది. ఏకంగా 11 వేల 440 కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉన్న వేళ ఊపిరి పోసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఈ భారీ ప్యాకేజీని ఆమోదముద్ర వేసింది.
ఈ ప్యాకేజీతో విశాఖ ఉక్కు మొత్తం నష్టాల నుంచి తేరుకుని లాభాల బాట పట్టేందుకు అవకాశం ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ అన్నది కేంద్రం 2021 జనవరి చివరిలో ప్రకటించింది. దాంతో నాటి నుంచి నాలుగేళ్ళుగా విశాఖ ఉక్కు ప్రైవేట్ బలిపీఠం మీద నిలబడి ఉంది. దానికి తోడు అన్నట్లుగా విశాఖ స్టీల్ లో ఉన్న సిబ్బందిని తగ్గించడం పదవీ విరమణ చేసిన వారి ప్లేస్ లో కొత్త వారిని నియమించక పోవడంతో పాటుగా కొన్ని విభాగాలు కూడా మూసివేయాలని చూడడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయం అయింది అని అంతా భావించారు.
అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు వచ్చాయని చెబుతూ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నట్లుగా కేంద్ర పెద్దలు చెబుతున్నారు. కానీ నిజానికి స్టీల్ ప్లాంట్ నష్టాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణం అని ఉక్కు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించినట్లు అయితే లాభాల బాటలో నడుస్తుందని వారు పదే పదే చెబుతున్నారు.
అంతే కాకుండా వర్కింగ్ కేపిటల్ కోసం భారీ ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇపుడు కేంద్రం దాని మీద సానుకూలంగా స్పందించింది. దాంతో విశాఖ ఉక్కుకు మంచి రోజులు వచ్చాయని అంతా సంబరపడుతున్నారు.
అదే సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కూటమి నేతలు అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎన్నికల వేళ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ జరగనీయమని టీడీపీ భారీ హామీ ఇచ్చింది.ఇపుడు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా కీలక హోదాలో ఉన్న రామ్మోహన్ నాయుడు ఈ విషయం మీద కేంద్ర పెద్దలతో సాగించిన మంతనాలు చేసిన ప్రయత్నాలకు ఇది సరైన ఫలితంగా వచ్చిందని అంటున్నారు.
మరో వైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడి తీసుకుని వచ్చారని దాని వల్లనే కేంద్రం స్టీల్ ప్లాంట్ కి భారీ ప్యాకేజ్ ప్రకటించిందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు అయితే స్టీల్ ప్లాంట్ కి ఇది చారిత్రాత్మక సందర్భం అని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఏపీకి గర్వకారణం అని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం కాదాని ఎంతోమంది త్యాగానికి ప్రతిరూపమని బాబు అన్నారు. ఆంధ్రుల గుండెలలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేక స్థానం ఉందని కూడా బాబు చెప్పుకొచ్చారు
మరో వైపు స్టీల్ ప్లాంట్ కి భారీ ప్యాకేజ్ ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఊపిరి పోసేలా రివైవల్ ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏది ఏమైనా విశాఖ వచ్చిన కేవలం పది రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్ కి భారీ ప్యాకేజీ ప్రకటించి తన అభిమానాన్ని చాటుకున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.