రాముడికి విరాళాలొద్దా.. రాములమ్మ ఫైర్

Update: 2021-01-22 05:10 GMT
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ కొనసాగుతోంది. అయితే విరాళాల సేకరణపై తాజాగా టీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య రాముడికి విరాళాలు ఇవ్వవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు.  మన దగ్గర రాముడి ఆలయాలు లేవా అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. విరాళాలు ఎందుకివ్వాలని పూజా మందిరాలు ఇళ్లలోనే ఉంటే గుళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం దేనికో చెప్పాలని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. దేవుళ్లకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టే వైపరీత్య మనస్తత్వం టీఆర్ఎస్ నేతలకే చెల్లిందని.. దేశంలో మనది ఏ రాష్ట్రమైనా ముందుగా భారతీయులమనే విజ్ఞత మరిచి అయోధ్య రాముడు, తెలంగాణ రాముడంటూ భేదభావాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలా తలతిక్కగా మాట్లాడి అహంకారాన్ని ప్రదర్శించే టీఆర్ఎస్ నేతలను ప్రజలు తప్పక ఇళ్లకే పరిమితం చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలని విజయశాంతి నిప్పులు చెరిగారు.

విరాళాలను భిక్షం అంటూ ఆరాధ్యభావంతో చేసే సమర్పణకు, అడుక్కోవడానికి కూడా తెలియని తమ అజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిని ఆ దేవుడు, ప్రజలు శిక్షిస్తారని.. ‘జై శ్రీరాం’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఘాటు విమర్శలు చేశారు. దేవుడి పేరుతో భిక్షం ఎత్తుకుంటున్నారని.. కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. తామంతా శ్రీరాముడి భక్తులమేనని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News