విజ‌య‌వాడ‌లో ఇంత ఘోర‌మా?

Update: 2015-08-20 07:58 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణం అయ్యేవ‌ర‌కు విజ‌య‌వాడ కేంద్రంగానే ప‌రిపాల‌న సాగించాల‌ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టిపెట్టారు. మంత్రుల కార్యాల‌యాలు స‌హా ప్ర‌ధాన ప‌రిపాల‌న కేంద్రాల‌న్నీ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఓవైపు విజయవాడ ఇలా ప‌రిపాల‌న కేంద్రంగా మారుతుంటే....బెజవాడ కార్పొరేషన్‌ లో అవినీతి బయటపడటం ప్రభుత్వ శాఖల్లో చర్చనీయాంశమైంది.

బెజవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో అసలే ఆర్థిక కష్టాలు... సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితి. ఉన్న కొద్దిపాటి నిధులతో అంతో ఇంతో అభివృద్ధి పనులు చేసుకొస్తుంటే  అధికారులు మాత్రం ఉన్న నిధుల్నీ బొక్కేస్తున్నారట‌. కష్టకాలంలో ఉన్న  కార్పొరేషన్‌ ను గట్టెక్కించాల్సిన అధికారులే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, చేయని పనులు చేసినట్లు నివేదికల్లో చూపించి  ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని మోసం చేశార‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

విజయవాడ పాతబస్తీ లోని 36వ డివిజన్‌ లో సుమారు పదిలక్షల  రూపాయలతో సిమెంట్‌ రోడ్డు నిర్మాణం పూర్తైందని ఇంజనీరింగ్‌ అధికారులు కమిషనర్‌ కు నివేదిక ఇచ్చారు. అధికారికంగా నివేదిక  చూసిన కమిషనర్‌ అంతా ఓకే అనుకున్నారు. ఓరోజు మార్నింగ్‌ విజిట్‌ లో భాగంగా కమిషనర్‌ అటుగా కారులో వెళ్తుండగా విషయం  గుర్తుకొచ్చి కొత్త రోడ్డును చూడాలనుకున్నారు. కానీ అక్కడ రోడ్డంతా గతుకులమయంగా ఉండటంతో అనుమానం  వచ్చి ఆరాతీయటంతో అసలు విషయం బయటపడింది. అసలు రోడ్డు పనులే ప్రారంభం  కాలేదని కమిషనర్‌ కు అర్థమైంది. ఇంజనీరింగ్‌  అధికారుల చేతివాటం చూసి కమిషనర్‌ ఖంగుతిన్నారు.

ఏకంగా తనకళ్ళకే గంతలు కట్టటంతో కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. దీంట్లో పాత్రధారులైన డీఈఈ, ఏఈ స్థాయి అధికారులను పిలిచి రోడ్డు పైనే క్లాస్‌ తీసుకున్నారు. మెమోలు కూడా ఇచ్చారు. అంతే అక్కడికక్కడే రాజకీయం మొదలైంది. అవినీతికి పాల్పడ్డ ఇద్దరు అధికారులకు ఇంజనీరింగ్‌ విభాగంలోని మిగతా సిబ్బంది వత్తాసు పలకడం మొదలుపెట్టారట. తమ తప్పేమీ లేదంటూ కమిషనర్‌ కు  ఎదురుతిరిగారట. తమకున్న రాజకీయ అండదండలతో, ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన అనుభవంతో కమిషనర్‌ ను సైతం ఉద్యోగులు ఎదిరించడం చర్చనీయాంశమవుతోంది.
అయితే దీనిపై ప్రభుత్వానికి నివేదికను పంపి ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారట కమిషనర్‌. అయితే అవినీతి ఉద్యోగులకు అండదండగా ఉన్న కొందరు నేతలు కమిషనర్‌ ప్రయత్నాలకు అడ్డంకులు  సృష్టిస్తున్నారని తెలుస్తోంది.  మ‌రోవైపు ఈ విష‌యం ముఖ్య‌మంత్రి దృష్టికి కూడా చేరిన‌ట్లుగా తెలుస్తోంది. అక్క‌డి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు బాబు క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. కమిషనర్‌ కు  ఇంజనీరింగ్‌ అధికారులకు మధ్య వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి మ‌రి.
Tags:    

Similar News