కేర‌ళ‌లో వైర‌ల్ చ‌ర్చ‌!.. ఆ బంగ్లా, ఆ కారు నెంబ‌ర్ ఓన‌ర్లెవ‌రో?

Update: 2021-05-21 15:30 GMT
విద్యాధికుల రాష్ట్రం కేర‌ళ‌లో ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌రమైన చ‌ర్చ వైర‌ల్ అవుతోంది. రాష్ట్రంలో వ‌రుస‌గా రెండో సారి పిన‌ర‌యి విజ‌య‌న్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సీపీఎం ఆధ్వ‌ర్యంలోని ఎల్డీఎఫ్ కూట‌మికి ఇది నిజంగానే సంతోష‌క‌ర‌మైన వార్తే. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన విజ‌య‌న్‌... త‌న కొత్త కేబినెట్ ను కూడా ప్ర‌క‌టించారు. ఆ కేబినెట్ స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం కూడా పూర్తి అయిపోయింది. అదిగో... స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే మ‌నం చెప్పుకుంటున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది. అదేంటంటే... కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో గ‌వ‌ర్న‌ర్ అధికార నివాసం రాజ్ భ‌వ‌న్ ప‌క్క‌నే ఓ స‌ర్కారీ బంగ్లా ఉంది. ప్ర‌భుత్వ ముఖ్యుల కోస‌మే ఈ భ‌వనాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే దోషం క‌లిగిన బంగ్లాగా పేరుప‌డిన ఈ బంగ్లాలో నివాసం ఉండే మంత్రి ఎవ‌ర‌న్న‌దే ఈ కొత్త చ‌ర్చ సారాంశం. ఈ బంగ్లాతో పాటుగా నెం:13 రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ క‌లిగిన‌ ప్రభుత్వ కారుకూ ఇదే త‌ర‌హా చ‌రిత్ర ఉంద‌ట‌. దీనిని తీసుకునేవారెవ‌ర‌న్న అంశం కూడా తెగ వైర‌ల్ గా మారిపోయింది.

లెఫ్టిస్ట్ లు... అదేనండి క‌మ్యూనిస్టులు అస‌లు దేవుడే లేర‌ని వాదించే నాస్తికులు క‌దా. మ‌రి వారికి కూడా ఈ త‌ర‌హా మూఢ న‌మ్మ‌కాలు ఉంటాయా?  సాధార‌ణంగా అయితే ఉండొద్దు గానీ... స‌ద‌రు బంగ్లాలో నివ‌సించిన నేత‌లు, స‌ద‌రు నెంబ‌రు కారును వినియోగించిన ప్ర‌ముఖుల‌కు ఎదురైన చేదు అనుభ‌వాలు క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంటే... ఎంత నాస్తికులైతే మాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఉంటారా? అందులోనూ పిన‌ర‌యి తొలి కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఆర్ధిక శాఖ ప‌గ్గాలు చేప‌ట్టిన థామ‌స్ ఐజాక్‌... గ‌డ‌చిన ఐదేళ్ల పాటు ఈ రెంటినీ వాడారు. మ‌రి ఆయ‌న ప‌రిస్థితి ఇప్పుడేమైంది. పిన‌ర‌యి కేబినెట్ లో కీల‌క వ్య‌క్తిగా ఓ వెలుగు వెలిగిన థామ‌స్ కు... ఇప్పుడు మంత్రి ప‌ద‌వి కాదు క‌దా క‌నీసం ఎమ్మెల్యేగా నిల‌బ‌డేందుకు పార్టీ టికెట్ కూడా ల‌భించ‌లేదు. అయినా థామ‌స్ అన్నీ తెలిసి ఈ దుస్సాహ‌సం ఎందుకు చేశారంటారా?  ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న సురేంద్ర‌న్ ఈ త‌ర‌హా మూఢ‌న‌మ్మ‌కంపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు సంధించారు. ఇంకేముంది... థామస్ కు పొడుచుకొచ్చేసింది. అబ్బే త‌న‌కేమీ అలాంటి మూఢ న‌మ్మ‌కాలు లేవంటూ ఆ బంగ్లాతో పాటు నెం:13 నెంబ‌ర్ కారును వినియోగించారు. ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు.

ఈ రెండింటి మ‌హిమ‌తో న‌ష్ట‌పోయిన వారు ఒక్క థామ‌సే కాదు... ఇంకా చాలా మందే ఉన్నార‌ట‌. అస‌లు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని యూడీఎప్ స‌ర్కారు హ‌యాంలో ఏ ఒక్క‌రు కూడా ఈ బంగ్లాను గానీ, కారును గానీ వాడేవారు కాద‌ట‌. అయితే 2006లో వీఎస్ అచ్యుతానంద‌న్ కేబినెట్ లో విద్యా శాఖ మంత్రిగా కొన‌సాగిన  ఎంఏ బేబీ ఈ రెంటీని వాడార‌ట‌. ఫ‌లితంగా ఆ త‌రువాత మంత్రిగా కాలేక‌పోవ‌డంతో పాటుగా ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో కాలుపెట్ట‌లేక‌పోయార‌ట‌. ఇక సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా (2006-11) మ‌ధ్య కొన‌సాగిన కొడియేరి బాల‌కృష్ణ‌న్ ఈ రెండింటినీ వాడిన నేప‌థ్యంలో ఆ తర్వాత ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డంతో పాటుగా అసెంబ్లీలోనూ అడుగుపెట్ట‌లేక‌పోయార‌ట‌. ఇక 2011-16 మ‌ధ్య‌లో కాంగ్రెస్ ప్ర‌ముఖుడు అర్య‌ద‌న్ మొహ‌మ్మ‌ద్ ఈ బంగ్లాలో నివ‌సించార‌ట‌. ఫ‌లితంగా 2016లో అసెంబ్లీ సీటును కూడా ఆయ‌న ద‌క్కించుకోలేక‌పోయార‌ట‌.

ఈ జాబితా ఇంకా చాలానే ఉందండోయ్‌. సీపీఎం కీల‌క నేత ఎంవీ రాఘ‌వ‌న్ 2001లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ లో చేరిపోయి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నార‌ట. ఆ స‌మ‌యంలో ఇదే బంగ్లాలో ఉంటూ... ఇదే నెంబ‌రు కారులో తిరిగిన ఆయ‌న ఆ త‌రుప‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూశార‌ట‌. స‌రే... ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు పిన‌ర‌యి కేబినెట్ లో మొత్తం మంత్రుల సంఖ్య 20గా ఉంది. చిన్న రాష్ట్రమైన కేర‌ళ‌లో 20 మంత్రిప‌ద‌వులంటే ఎక్కువే. మ‌రి ప్ర‌భుత్వ ధ‌నాన్ని చాలా పొదుపుగా ఖ‌ర్చు చేయాల‌ని భావించే పిన‌ర‌యి... త‌న కేబినెట్ లోని ఏ మంత్రిగా ఈ బంగ్లాను కేటాయిస్తారో చూడాలి. ప్ర‌స్తుతానికి ఆయా మంత్రుల‌కు కేటాయించే బంగ్లాలు, కార్ల‌కు సంబంధించిన జాబితాలో ఈ బంగ్లా గానీ, ఈ కారు నెంబ‌రు గానీ లేవ‌ట‌. అయితే ఆ బంగ్లాను ఖాళీగా ఉంచి త‌న కేబినెట్ లోని మంత్రులు... ఇర‌త్రా ప్రైవేట్ బంగ్లాల్లో ప్ర‌జా ధనాన్ని వెచ్చించి బ‌స చేసేందుకు పిన‌ర‌యి ఒప్పుకుంటారా? అయితే మ‌రి ఈ సారి ఈ బంగ్లా, కారు నెంబ‌రు ద‌క్కించుకునే బ‌క‌రా ఎవరో అన్న చ‌ర్చ ఆస‌క్తి రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News